Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహంకాళి ఈవో మనోహర్‌రెడ్డి
నవతెలంగాణ-బేగంపేట్
లష్కర్లో అత్యంత వైభవంగా జరిగే ఉజ్జయిని మహంకాళి ఆషాడ బోనా ల జాతరలో భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి వెల్లడించారు. గురువారం మహం కాళి ఆలయ ప్రాంగణంలో అలయ కమిటీ చైర్మన్ సూరిటీ కమేష్, కమిటీ సభ్యులతోపాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతర ఏర్పాట్లపై పలు విషయాలను ఆయన వెల్లడించారు. జాతర ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయని, దాదాపు అన్ని ఏర్పాట్లు జరిగాయని వెల్లడించారు. ఈనెల 25న ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయని, నాలుగు గంటల 30 నిమిషాల తరువాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు నాలుగు లక్షలకుపైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, క్యూలైన్లలో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని వాటిని భక్తులు వినియోగించుకోవాలని చెప్పారు. ఎవరికైనా కరోనా ఉందని అనుమానం ఉంటే అక్కడే టెస్ట్ చేయించుకునేెందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. విఐపి పాసులు తీసుకున్నవారు వారి పాస్‌లలో తెలిపిన సమయంలోనే అమ్మవారి దర్శనానికి రావాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బోనం తీసుకువచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక లైను ఏర్పాటు చేశామని.. ఆ లైన్లో బోనం తెచ్చేవారికి మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. విఐపి పాసులు తీసుకున్నవాళ్లు అంజలి టాకీస్ వైపు ఏర్పాటు చేసిన లైన్లోనే రావాలని ఈవో మనోహర్ రెడ్డి వెల్లడించారు. 26వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల సమయం వరకు అమ్మవారి దర్శనానికి సామాన్య భక్తులకు ప్రవేశం లేదని ఈ విషయాన్ని భక్తులంతా గమనించాలని ఈవో చెప్పారు. పాలకమండలి సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ కామేష్, ఆనంద్ పటేల్, కష్ణ రామతీర్థ శర్మ, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.