Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిమాయత్ సాగర్ రిజర్వాయర్ :
ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జంటనగరాలకు తాగునీరందిస్తున్న హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట) రిజర్వాయర్లు నిండు కుండల్లా మారాయి. భారీగా వరద నీరు వస్తోంది. అప్రమత్తమైన జలమండలి అధికారులు రెండు రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువనున్న మూసీ నదిలోకి వదిలారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌లోకి 1762.60 అడుగుల మేర (2.716 టీఎంసి) వరద నీరు చేరుకుంది. దీనికి మొత్తం 17 గేట్లు ఉన్నాయి. రిజర్వాయర్ నీటి మట్టం 1763 అడుగులవద్ద మూడు గేట్లను ఒక అడుగు వరకు ఎత్తి దిగువనున్న మూసిలోకి మంగళవారం వదిలారు. మరో రెండు గేట్లను తెరిచారు. మొత్తం ఐదు గేట్ల ద్వారా 1716 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులుకాగా ప్రస్తుత నీటి స్థాయి 1762.60 అడుగులగా నమోదైంది.
మరో వైపు ఉస్మాన్ సాగర్ (గండిపేట)కు కూడా ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో జలమండలి అధికారులు ఈ రిజర్వాయర్ రెండు గేట్లు ఒక అడుగు వరకు ఎత్తి 200 క్యూసెక్కుల వరద నీటిని మూసి నదిలోకి వదిలారు. దీనికి మొత్తం 15 గేట్లు ఉన్నాయి. ఈ రిజర్వాయర్ గేట్లను దాదాపు దశాబ్దం తరవాత ఎత్తారు. చివరిసారిగా 2010 లో ఎత్తినట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులుకాగా ప్రస్తుతం 1784.90 అడుగులున్నాయి.
లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం
జంట జలాశయాల్లో భారీగా వరద నీరు చేరడంతో మూసీలోకి వదులుతున్న అధికారులు ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మూసీనది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. జలమండలి సిబ్బంది మూసి నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఈ రిజర్వాయర్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, మురికివాడ ప్రాంతాలు, మూసీనది పరీవాహక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను ఆదేశించారు.