Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా లష్కర్ బోనాలు
-* సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
- బంగారుబోనం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాల జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఆలయ పరిసరాలు జన ప్రభంజనంగా మారాయి. ఎక్కడ చూసినా బోనాలతో వస్తున్నవారు, బోనాలను చూసేందుకు వస్తున్నవారు కనిపించారు. పండుగ వాతావరణంతో పరిసరాలు కళకళలాడాయి. ఆలయంవద్ద మహిళలు, చిన్నారులు, యువతులు తీరొక్క బోనంతో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెల్లవారు జామునే కుటుంబ సభ్యులతో వచ్చి బంగారు బోనంతో తొలిబోనం, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
మంత్రులు, ప్రముఖులు అక్కడికి వచ్చిన సందర్భంగా ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభంతో, వేదమంత్రాలతో స్వాగతం పలికారు. బోనాల సమర్పణ, పూజల అనంతరం ఆశీర్వదించారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. భక్తులు కొవిడ్ రూల్స్‌పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఈవో మనోహర్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, కార్పొరేటర్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రముఖులు దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, రాజ్యసభ సభ్యులు సంతోష్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం సతీమణి ప్రత్యేక పూజలు నిర్వహించగా వేదపండితులు ఆశీర్వదించారు. అనంతరం సీఎం సతీమణి శోభ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు. పర్యాటక, కార్మికశాఖల మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డిలు, ఎమ్మెల్యే దానం నాగేందర్, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, సురేందర్, ముఠా గోపాల్ అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రశ్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం లేకుండేనని, తెలంగాణ వచ్చాక ప్రతీ పండుగతోపాటు బోనాలు ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర రావాలని అప్పట్లో కేసీఆర్ మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలవల్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న టీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే 24 నెలల్లో ప్రజలను పీడిస్తున్న సమస్యలు తొలగుతాయన్నారు. మహంకాళి మాత ఆశీర్వాదం, సోనియా గాంధీ సహకారంతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా ప్రజలకు సామాజిక న్యాయం జరలేదన్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజరు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమై పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలను సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో పాలించేలా చూడాలని కోరుకున్నట్లు తెలిపారు.