Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఊహించని విధంగా నాలుగేండ్లకు పెంచుతూ జీవో 26ను తీసుకురావడం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జీపీఎస్) భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మార్చడమేనని రాష్ట్ర జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షులు నిమ్మల వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీపీఎస్‌ల ప్రొబెషనరీ కాలాన్ని నాలుగేండ్లకు పెంచడం శోచనీయమన్నారు. తమకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన వేతనాల విషయంలో అభ్యంతరం ఏమీ లేదని, తమకు సర్వీస్ బుక్ సైతం లేదన్నారు. ప్రొబేషనరీ కాలాన్ని రెండేండ్లకు కుదించి, ఉద్యోగ భద్రత కల్పిస్తూ పే స్కేల్ ను పెంచాలని కోరారు. గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన అన్ని పనులు తామే చూసుకోవడంతో పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను విన్నవించుకోవడానికి సీఎం అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. సమావేశంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కిరణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సైదారెడ్డి, కోశాధికారి గాధరి రమేష్, యాకన్న, పలు జిల్లాల నుంచి పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.