Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్తనాళాలు పూడుకుపోవడంతో ఇబ్బంది యాంజియోప్లాస్టీ చేసిన గ్లెనిగల్స్ గ్లోబల్ వైద్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అయిన గ్లెనీగల్స్ గ్లోబల్ వైద్యులు 80 ఏండ్ల వృద్ధురాలికి గుండె పోటు తీవ్రస్థాయిలో రాగా ఆమె ప్రాణాలు కాపాడారు. సాధారణంగా అందరికీ శరీరంలో ఎడమవైపు గుండె ఉంటే, ఆమెకు మాత్రం అత్యంత అరుదుగా కుడివైపు ఉంది. ఇది పుట్టుకతోనే ఉండటంతో గుండెకు ఉండే బహద్ధమని కూడా ఎడమవైపు కాకుండా కుడివైపు ఉంది. ఇంత పెద్దవయసులో మహిళకు, అది కూడా కుడివైపు రక్తనాళంలో పూడికలకు చికిత్స చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. అయినా ఆసుపత్రిలో అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు ఉండటంతో దీన్ని ఎలాంటి ఇబ్బందీ లేకుండా విజయవంతంగా పూర్తిచేశారు. ఈ చికిత్స గురించి గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ సాయి సుధాకర్ మాట్లాడుతూ 'పెద్ద వయసు వారికి గుండెపోటు వస్తే 'గోల్డెన్ పీరియడ్'లోనే యాంజియోప్లాస్టీ చేస్తేనే వారి ప్రాణాలు కాపాడగలం. ప్రస్తుత కేసులో ఈ వృద్ధురాలిని తొలుత వేరే ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుండె కవాటాలు అన్నీ కుడివైపు ఉండటం, అక్కడ బహద్ధమని క్రమంగా సన్నబడుతూ రావడంతో ముందుగా రోగికి రక్తం పల్చబరిచే మందులు ఇచ్చి అప్పుడు మరో ఆసుపత్రికి తరలించాలనుకున్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఆమెను గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ నిపుణులైన వైద్యబందం అత్యంత జాగ్రత్తగా చికిత్స చేశారు. గుండె, రక్తనాళాలు సైతం కుడివైపు ఉన్నా, నూరుశాతం పూడుకుపోయిన బహద్ధమనికి విజయవంతంగా చికిత్స చేశాం. మా బృందం అందుబాటులో ఉన్న వనరులతోనే ఈ సవాలును స్వీకరించింది. మేం ముందుగా యాంజియోగ్రామ్, తర్వాత యాంజియోప్లాస్టీ చేసి, స్టెంట్ వేశాం. దాంతో ఆమె ప్రాణాలు కాపాడగలిగాం. చికిత్స తర్వాత రోగిని రెండు రోజుల పాటు నిశిత పరిశీలనలో ఉంచాం. చికిత్సకు ఆమె బాగా స్పందిస్తున్నారని, వైటల్స్ అన్నీ బాగున్నాయని గుర్తించిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం' అని వివరించారు.