Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
- జిల్లాలో 56 వేల మంది అర్హుల గుర్తింపు
- స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డుల పంపిణీ
- ఆగస్టు నుంచి రేషన్ సరుకులు అందజేత
ఆరేండ్ల ఎదురుచూపులకు తెరపడింది. సుదీర్ఘకాలం తర్వాత కొత్త రేషన్ దరఖాస్తుదారుల కల నేటితో నిజం కాబోతుంది. తెల్లరేషన్ కార్డు కేవలం సరుకులకే కాకుండా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల మంజూరుకు ప్రామాణికంగా తీసుకుంటుండడంతో లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు కొత్త కార్డుల జారీకి చర్యలు చేపట్టారు. అన్నిరకాల వడబోతల అనంతరం నేటి నుంచి ఈనెల చివరి వరకు అర్హులకు కార్డులు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రులతో పాటు నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో ఆరేండ్ల కాలంలో కొత్త రేషన్ కార్డుల కోసం 1.77 లక్షల దరఖాస్తులు రాగా.. 44,734 కార్డులు ఇప్పటికే పంపిణీ చేయగా..31,528 కార్డులను తిరస్కరించారు. ఇందులో 99,104 దరఖాస్తుల పరిశీలన చేయాలని అధికారులు గుర్తించారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు అధికారులు పెండింగ్ దరఖాస్తులను 360 డిగ్రీ యాప్ ద్వారా పరిశీలన జరిపారు. ఇందులో అర్హతలేని సుమారు 13 వేలకుపైగా దరఖాస్తులను పక్కకు పెట్టేశారు. మొత్తం 86 వేల కార్డులను క్షేత్రస్థాయి పరిశీలన కోసం గుర్తించిన అధికారులు వీటిలో 56,064 మందిని అర్హులుగా గుర్తించారు. వివిధ కారణాలతో మిగితా దరఖాస్తులను తిరస్కరించారు. కాగా జిల్లాలో 670 పౌరసరఫరాల షాపులకు గాను 613 పని చేస్తున్నాయి. వీటి పరిధిలో 5,80,634 రేషన్ కార్డులున్నాయి. వీటిలో ఆహారభద్రత కార్డులు 5.49లక్షలకుపైగా ఉండగా.. అన్నపూర్ణ కార్డులు 1312, అంతోద్యయ కార్డులు 30వేలకుపైగా ఉన్నాయి. ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు 1,36,28,385 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. కాగా వీటికి అదనంగా ఆగస్టు నుంచి మరో 56వేల కొత్త రేషన్ కార్డులు పెరుగుతుండడంతో జిల్లాలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 6,36,698కు చేరనుంది.
కంప్యూటర్ ప్రింట్కే పరిమితం..!
నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 56వేల మంది అర్హులకు నేటి నుంచి ఈనెల 30వరకు ఆహార భద్రత కార్డులను మంత్రులు, ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో అందించనున్నారు. ఇందులో భాగంగా నేడు సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డులోని జోరాస్టియన్ క్లబ్లో పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి అర్హులకు కొత్త రేషన్ కార్డులను అందజేయనున్నారు. కొత్తగా కార్డులు మంజూరైన వారికి ఆగస్టు నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత వరకు కొత్త రేషన్ కార్డు నమూనానే రూపొందించలేదు. కొత్త కార్డుల నమూనా ఎలా ఉంటుందనే స్పష్టత లేదు. అయితే ప్రస్తుతానికి ప్రత్యేకంగా కార్డును రూపొందించి ఇవ్వడం లేదు. గతంలో అందించినట్టుగానే కేవలం కార్డుదారుల వివరాలు పౌరసరఫరాల శాఖ రికార్డుల వరకే పరిమితం చేసి కార్డు మంజూరైనట్టుగా ధ్రువపత్రం అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మార్పులు చేర్పులకు మోక్షమెప్పుడో..!
కొత్త రేషన్ కార్డుల కోసమే కాకుండా వివిధ కారణాలతో గతంలో జిల్లాలో మొత్తం 99,668 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 38,846 కార్డుల మార్పులు పూర్తిచేయగా.. 48,498 రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ దరఖాస్తులను ప్రభుత్వం పక్కకు పెట్టింది. ప్రస్తుతం అవి పెండింగులోనే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు. ఇందులో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు కార్డు బదిలీ కోసం, పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన వారి పేర్లు నమోదు చేసుకోవడం కోసం, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన వారి పేర్లు నమోదు కోసం, మొదటి నుంచి కార్డులో పేర్లు నమోదు కాని వారు, విడిపోయిన కుటుంబాల వారు.. ఇలా వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకున్నవారు ఉన్నారు. వీటిని ఎప్పుడు పరిశీలిస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఇలాంటి వారంతా తమకు ఎప్పుడు మోక్షం కలుగుతుందోనని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంతవరకు ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.