Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సూచించారు. సోమవారం పేట్‌బషీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ళ పరిధిలోని ముంపు ప్రాంతాలలో వర్షకాలంలో వరద నీటి సమస్య, డ్రయినేజీ ఓవర్ ఫ్లో, ఎస్టిపిల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, హెల్త్ అండ్ శానిటేషన్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో వరద సమస్యను అధిగమించేందుకు ముంపు ప్రాంతాలలో చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ళ పరిధిలోని శ్రీరామ్‌నగర్, బాలాజీ లేఅవుట్, చంద్రగిరినగర్, మోతినగర్, వోక్షిత్ ఎన్క్లేవ్, సోనియా గాంధీనగర్, శ్రీకృష్ణనగర్, రావినారాయణరెడ్డినగర్, వెంకన్నహిల్స్, మోడీ బిల్డర్స్, గణేష్‌నగర్, గోదావరి హోమ్స్, జయరాంనగర్, ఫాక్స్‌సాగర్, సుభాష్‌నగర్, కోల్ నాలాకింది ప్రాంతాలలో వరద సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షపు నీటి నాలాలవెడల్పు పనులు, కల్వర్టుల నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను ముమ్మరం చేయాలన్నారు. డ్రయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులలో మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు కలుషితం కాకుండా శుద్ధీకరించే కేంద్రాలు (ఎస్టిపి)లను ఏర్పాటు చేయాలన్నారు. రూ.126.79 కోట్లతో వెన్నెలగడ్డ 5ఎంఎల్డి, గాయత్రినగర్ 5 ఎంఎల్డి, శివాలయనగర్ 14ఎంఎల్డి, ఫాక్స్‌సాగర్ 14 ఎంఎల్డి, పరికి చెరువు 28ఎంఎల్డి సామార్థ్యంతో ఎస్టిపి నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఎస్టిపి జీఎం తిప్పన్న, డిజిఎం వినోద్, డిపిఎం జ్ఞానేశ్వర్‌రెడ్డి, జీఎం శ్రీధర్‌రెడ్డి, టౌన్ ప్లానింగ్ డీసీపీ రఘునందన్, సాంబయ్య, ఈఈ కృష్ణ చైతన్య, సర్వేయర్ సునీత, డీఈలు భానుచందర్, రామ్చందర్రాజు, ఎస్ఓలు సంగీత, కిష్టయ్య, డీఈ ప్రశాంతి, ఎస్ఎస్ పోతారెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.