Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవగాహన సదస్సులో గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
గతంలో అత్యున్నత స్థాయి నుంచి కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గిపోయినా, ప్రజలు మళ్లీ సాధారణ జీవనం గడపడానికి, పూర్తిగా ఊపిరి పీల్చుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఇప్పటికీ నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరమే. ఈ సమయంలో ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పరిస్థితి మరింత విషమించి, ఉత్పాతం సంభవిస్తుంది. థర్డ్‌వేవ్‌లో పెద్దసంఖ్యలో కేసులు వస్తే వాటిని ఎదుర్కోవడం ఎలాగన్న అంశంపై గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు సోమవారం ఒక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా అవేర్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రి కన్సల్టెంట్ పల్మనాలజిస్టు, స్లీప్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ సుధీర్‌ప్రసాద్ మాట్లాడుతూ 'ప్రస్తుతం ఇంకా సాధారణ పరిస్థితులు రాలేదు. కొవిడ్-19పై పోరాటంలో మాస్కు అత్యంత సులభమైన, చాలా ముఖ్యమైన మార్గం. సరిగా ధరిస్తే మామూలు సర్జికల్ మాస్కు, వస్త్రంతో చేసిన మాస్కు కూడా సరిపోతుంది. ఆరోగ్యరంగంలో పనిచేసేవారు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, పోలీసులు, అత్యవసర సేవలు అందించేవారు మాత్రం తప్పనిసరిగా ఎన్95 మాస్కులు ధరించాలి. మాస్కును చేత్తో మాత్రం తాకకండి. ఒకసారి ముట్టుకుంటే మాత్రం వెంటనే చేతులు సబ్బుతో గానీ, శానిటైజర్‌తోగానీ శుభ్రం చేసుకోండి. అవసరం లేనిదే రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లొద్దు' అని సూచించారు.