Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణగూడ
తన ఇంటిని గుండాల సహాయంతో దౌర్జన్యంగా ఆక్రమించుకోవడమే కాకుండా తన భార్య, మహిళా బంధువులపై దాడులకు తెగబడ్డ స్థానిక గుండాల నుంచి తన ఇంటిని ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు దళితుడైన ములుగు సురేష్ వేడుకున్నారు. ఈ మేరకు సోమవారం లిబర్టీలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం ఎదుట తన ముగ్గురు పిల్లలతో నిరసన దీక్ష చేపట్టారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.1 కోటి విలువ చేసే కుత్బుల్లాపూర్, పద్మనగర్ పేస్-11లోని తన ఇంటిని స్థానిక రౌడీలైన జశ్వంత్, సాయిప్రసాద్ గౌడ్ ఇతర అనుచరులు తేదీ 24.07.2021 మధ్యాహ్నం తాను ఇంట్లో లేని సమయంలో తన భార్య, పిల్లలు, బంధువులపై దాడి చేసి తన ఇంట్లోని సామాన్లు బైట పడేసి చంపుతామని బెదిరించి ఇంటిని ఆక్రమించారన్నారు. ఈవిషయమై స్థానిక పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుల పక్షాన నిలిచారాని, పేట్ బషీర్ బాగ్ సీఐ రమేష్ తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని వాపోయారు. ఈవిషయం రాష్ట్ర డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవహక్కుల కమిషన్ కు పిర్యాదు చేసినప్పటికి వారి ఆదేశాలు తుంగలో తొక్కారన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అవ్వడమే కాకుండా ఎఫ్ఐఆర్ అయ్యిందని, నేటి వరకు నిందితులను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకోలేదని ఆరోపించారు.వారి నుంచి తన భార్య, పిల్లలకు ప్రాణహాని ఉందని, ఏ సమయంలోనైనా తమపై దాడి జరిగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు.తన ఇంటిని తనకు ఇప్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.