Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమ్యూనిస్టుల వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు
- వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం దుర్మార్గం
- 'దళిత బంధు'ను చిత్తశుద్ధితో అమలు చేయాలి
- సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- ముదిగొండ
దేశ, రాష్ట్ర ప్రజలు కమ్యూనిస్టు పార్టీల వైపు మళ్లీ ఆకర్షితులవుతున్నారని, ప్రజాసమస్యలపై పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. చిరుమర్రిలో ఆ పార్టీ నాయకులు బండి శేఖర్ అధ్యక్షతన నాలుగు గ్రామశాఖల మహాసభలు సోమవారం చిరుమర్రి(బండి నారాయణనగర్)లో ఉత్తేజంతో జరిగాయి ఈ మహాసభలలో తమ్మినేని ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ అమరవీరుల చిత్రపటాలకు పుష్పగుచ్చాలతో నివాళులుర్పించారు. అనంతరం మహాసభలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. సోషలిస్టు దేశ, రాష్ట్రాలలో కరోనాను నిర్మూలించగలిగారన్నారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగాకోరు విధానాలతో ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చేసి దేశ, రాష్ట్రాలను దివాలాదీయించారన్నారు. ప్రతిపక్ష నాయకుల, ప్రజా సంఘాల బాధ్యుల, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై ప్రయోగించాల్సిన పెగాసస్‌ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన విమర్శించారు. కేంద్ర హౌం మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దళిత బంధు పథకం చిత్తశుద్ధితో రాజకీయం చేయకుండా హుజురాబాద్‌తోపాటు రాష్ట్రం మొత్తం అమలు చేయాలన్నారు. అనంతరం పార్టీలో స్థిరస్థాయిగా జెండా పట్టుకొని నిలిచిన వారిని 70 సంవత్సరాలు దాటిన సీనియర్ కామ్రేడ్స్‌ను తమ్మినేని వీరభద్రం శాలువా కప్పి ఘనంగా సత్కరించి మెమొంటో అందించారు. గ్రామమహాసభలో నాలుగు పార్టీ గ్రామశాఖలను సమీక్ష సమావేశం నిర్వహించి కార్యదర్శి నివేదికను కామ్రేడ్ సామినేని రాంబాబు ప్రవేశపెట్టారు. పార్టీ గ్రామ 4 శాఖల కార్యదర్శులుగా కె.గురవయ్య, మోర రామకృష్ణ, ఇనప ఉపేందర్, మహిళాశాఖ కార్యదర్శి కోలేటి అరుణలను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సిపిఎం పార్టీ గ్రామకార్యదర్శిగా సామినేని రామయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బండి రమేష్, పార్టీ సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా నాయకురాలు బండి పద్మ, పార్టీ మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, నాయకులు టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, మందరపు వెంకన్న, కోలేటి ఉపేందర్, ఇరుకు నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు, ఎంపీటీసీ కోలేటి అరుణ, మాజీ సర్పంచ్ ఇనప బాబు, ఐద్వా మండల అధ్యక్ష కార్యదర్శ మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి, పార్టీ గ్రామకార్యదర్శి సామినేని రామయ్య తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లి : పెగాసస్ (స్పైవేర్) తో వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సోమవారం మండలంలోని అనాసాగరం గ్రామంలో తుమ్మలపల్లి అప్పారావు నివాసంలో జరిగిన పార్టీ గ్రామ శాఖ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలో ప్రధాన సెంటర్లో, అమరవీరుల స్తూపం వద్ద పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ స్పైవేర్ ద్వారా బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాపింగ్ చేసి వ్యక్తిగత విషయాలను హరించడం పట్ల పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారిని నివారించడంలో బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో సిపిఎం ఆధ్వర్యంలో కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాలో కరోనా కేంద్రాలను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయిిి వీధిన పడ్డారు అన్నారు. మరో 14 కోట్ల మంది ఉపాధి కరువై సొంత గ్రామాలకు పయనమయ్యారు అన్నారు. ప్రస్తుత దేశంలో జరుగుతున్న పరిణామాలు, మార్పులతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు రాష్ట్రంలోని గ్రామ శాఖలను బలోపేతం చేసేందుకు పార్టీ తగిన కార్యాచరణను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనాసాగరం పార్టీ నూతన గ్రామ శాఖ కార్యదర్శిగా నున్న మధుసూదన్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నేలకొండపల్లి మండల కేంద్రంలో పునర్ నిర్మాణం చేస్తున్న పార్టీ కార్యాలయాన్ని తమ్మినేని పరిశీలించారు. అక్కడ నుండి మండలంలోని ఆరెగూడెం గ్రామంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి కొంగర సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి గొడవర్తి నాగేశ్వరరావు, నాయకులు ఏటుకూరి రామారావు, కేవీ రామిరెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, ఎడ్ల తిరుపతిరావు, భూక్య కృష్ణ, బొడ్డు బాబు తదితరులు పాల్గొన్నారు.