Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు రేషన్ కార్డుల పంపిణీలో తీవ్ర జాప్యం చేసింది. ఫలితంగా గత అనేక సంవత్సరాలుగా అర్హత ఉన్న రేషన్ కార్డుకు నోచుకోక అనేకమంది పేదలు ప్రభుత్వ పథకాలు వర్తించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా రేషన్ కార్డుల పంపిణీ తోపాటు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు పింఛన్లు వంటి పథకాలను అందిస్తామంటూ అనేక సభలలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొట్టారు. ఎట్టకేలకు గత కొంత కాలంగా రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డులను పొందాలంటే ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. ఈ పేరుతో అనేకమంది నిరుపేదల రేషన్ కార్డులను తొలగించింది. ఇదే క్రమంలో అర్హతలేని వారి విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇచ్చి నిజమైన లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేసిందని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలోని రైతు వేదికలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సాక్షిగా మండలంలోని రాజేశ్వరపురం, మంగాపురం తండ గ్రామాల సర్పంచులు దండ పుల్లయ్య, భూక్య సుధాకర్లు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ప్రజాప్రతినిధిగా ఎన్నికై మూడు సంవత్సరాలు కావస్తున్నా నేటికీ రేషన్ కార్డులు అందించలేదని గ్రామంలోని అనేక మంది లబ్ధిదారులు నిలదీస్తున్నారంటూ వారికి సమాధానం చెప్పుకోలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో రేషన్ కార్డులకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సంబంధిత రెవెన్యూ అధికారులు తమకు సమాచారం అందించడం లేదని, ప్రతి విషయంలో తమకు తీవ్ర అవమానం జరుగుతుందంటూ అటువంటప్పుడు మాకు పదవులు ఎందుకంటూ వాపోయారు. గ్రామాలలో తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉన్నామని ఏ అధికారి తమకు సరైన గౌరవం, విలువ ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాటలు అన్నది ఎవరో ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు కాదు సుమా! సాక్షాత్తు అధికార టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సాక్షిగా అనడం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మాటలు విన్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఒకింత స్థానిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తమ ప్రజాప్రతినిధులను సైతం వారించే ప్రయత్నం చేశారు. రేషన్ కార్డుల మంజూరులో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని తిరిగి సరిచేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అనంతరం మండల వ్యాప్తంగా అర్హులైన 75 మందికి కళ్యాణ లక్ష్మి, 587 మందికి రేషన్ కార్డు అర్హత పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ వజ్జా రమ్య, నేలకొండపల్లి గ్రామం సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, వెంకటలక్ష్మి, తహసిల్దార్ తాళ్లూరి సుమ, ఎంపీడీవో చంద్రశేఖర్, ఈజీఎస్ ఏపిఓ ఆర్ సునీత, మండల వ్యవసాయ అధకారి ఎస్వికే నారాయణరావు, ఆర్ ఐ రమేష్, మాధవి, ఎంపీవో నెల్లూరు వెంకటేశ్వర్లు, పిఆర్ ఏఈ విద్యాసాగర్, విద్యుత్ ఏఈ భోజ నాయక్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు ఉన్నం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.