Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పి.సోమయ్య
నవతెలంగాణ-కారేపల్లి
పేదల రెక్కల కష్టాన్ని నిత్యావసర ధరలు పెంచి లూటి చేస్తున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పీ.సోమయ్య విమర్శించారు. సోమవారం కారేపల్లి మండలం ఎర్రబోడులో జరిగిన శాఖా మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ మార్కెట్‌కు పోతే ధరల చూచి పేదల కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. పెట్రోలియం ధరల పెంపు నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. కరోనా దెబ్బకు ఉన్న ఉద్యోగాలు పోయి దివాళా తీస్తే దేశంలో 10 మంది బడా పెట్టుపడిదారుల ఆదాయం మాత్రం రెట్టింపు అయిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక శ్రమను దోచేపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. దానిలో భాగంగా వ్యవస్యాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం, కార్మిక చట్టాలను తీసుకొస్తుందన్నారు. పోడుపై కేసీఆర్‌ది రెండు నాలుకల ధోరణి అని అన్నారు. ఎన్నికలప్పుడు హామీలతో జనాలను ఊదరగొట్టి తర్వాత మాటమార్చే రకమన్నారు. దళిత బంధు పూర్తి అమలుపై ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయన్నారు. దళితులకు మూడెకరాల భూమి, ఉద్యోగాల కల్పన, పోడుకు హక్కు కల్పించటం వాగ్ధానాల బాటలో దళిత బంధు నడిస్తే బడుగుల కోపాగ్నికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కే.నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే.నరేంద్ర, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, పండగ కొండయ్య, కరపటి సీతారాములు, కుర్సం శ్రీను, కుంజా వెంకన్న, పాయం ఎర్రయ్య, కరపటి లక్ష్మయ్య, కుందనపల్లి పవన్, ఉపసర్పంచ్ వజ్జా నరేష్ తదితరులు పాల్గొన్నారు.