Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో బీసీ/ఎస్సీ/ఎస్టీలకు కోటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎస్పీ సింగ్ భగేల్ ను ఢిల్లీలో ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం జడ్జీల నియామకాల్లో బీసీల శాతం 3 శాతం, ఎస్సీ/ఎస్టీల శాతం 2 శాతం కూడా దాట లేదన్నారు. దేశ జనాభాలో 56 శాతం బీసీలకు, 25 శాతం ఎస్సీ/ఎస్టీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. ఇంతవరకు సుప్రీంకోర్టులో 46 మంది చీఫ్ జస్టిస్ నియామకం జరుగగా ఒక్క బీసీని కూడా నియమించలేదన్నారు. బీసీలకు న్యాయస్థానంలోనే అన్యాయం జరిగితే ఎలా అని ప్రశ్నించారు. కులవివక్షతతోనే వీరిని ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా నియమించడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి జనాభా ప్రకారం బీసీ/ఎస్సీ/ఎస్టీలకు హైకోర్టు, సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఆయన వెంట బీసీ నేతలు గుజ్జ కృష్ణ, లాకా వెంగల్ రావు, నీల వెంకటేష్, లాల్ కృష్ణ, నుకనమ్మ, నాగేశ్వర్ రావు, బోను దుర్గా నరేష్, భుపేష్ సాగర్, బర్క కష్ణ, నంద గోపాల్, అనంతయ్య, కే.నర్సింహ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, చంటి ముదిరాజ్, పగిల్ల సతీష్, ఉదరు, ప్రసాద్ గౌడ్, బైరు నరేష్ గౌడ్, ఉదరు, బబ్లు గౌడ్, చరణ్ యాదవ్ ఉన్నారు.