Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 360 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆగష్టు 7 లోపు అందజేయాలి
- ఇవ్వకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం
- ప్రభుత్వానికి చేనేత సంఘాల హెచ్చరిక
నవతెలంగాణ-సిటీబ్యూరో
'తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న 360 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఆగష్టు7వ తేదీలోపు చేనేత రంగానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి. లేదంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం' అనిజాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ హెచ్చరించింది. ఏడేండ్లలో చేనేతరంగపు సమస్యలు, చేనేతవర్గపు వెనుకబాటు తనంపై మంగళవారం హైదరాబాద్‌లో సోమాజిగూడలో జాతీయ నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మెన్ దాసు సురేశ్ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి చేనేత పవర్లూమ్ కార్మికులు, చేనేత సహాకార సంఘాల ప్రతినిధులు, సామాజిక ఉద్యమ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొని ఆత్మహత్య బాధిత మహిళలకు సంఘీభావం ప్రకటించారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబ మహిళలతో నామినేషన్ వేయించి తమ సత్తా ఏమిటో చూపిస్తామని కమిటీ చైర్మెన్ దాసు సురేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకటరెడ్డి, ప్రొ.కొదండరామ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరాశోభన్, ప్రొఫెసర్ హరగోపాల్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజిమురళీధర్, సీపీిఐ సీనియర్ నాయకులు పాశికంటి లక్ష్మీనర్సయ్యతో పాటు వివిధ చేనేత సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని రాష్ట్రంలో నేతన్నకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.