Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్ అలీ
- భరోసా కేంద్రాలతో మరింత భద్రత పెరుగుతుంది : డీజీపీ మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-మలక్‌పేట్/హయత్‌నగర్
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం సరూర్ పరిధి నగర్ భగత్ సింగ్ నగర్లో మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న భరోసా కేంద్రానికి డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. మహిళల భద్రతకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నామని, షీ టీమ్స్, పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని, భరోసా కేంద్రాల ఏర్పాటుతో మరింత భద్రత ఏర్పడుతుందని తెలిపారు. కుటుంబ సమస్యలు, ఇతర సమస్యలతో చాలామంది మహిళలు పోలీస్ స్టేషన్లకు వస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి భరోసా సెంటర్లు కృషి చేస్తాయని చెప్పారు. సిటీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని చెప్పారు. నేరాల నియంత్రణకోసం సిటీలో 60 శాతం వరకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు అమర్చబడి ఉన్నాయని, వాటి ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగడంవల్ల క్రైమ్‌రేట్ కంట్రల్ చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్లో పోలీసులు బాగా పనిచేశారని, కరోనా కంట్రోల్ కావడంలో ఫ్రంట్‌లైన్ వారియర్సుగా వారిపాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పారు.
డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం భద్రతా సెంటర్‌కు శంకుస్థాపన చేశామని, ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని అన్నారు. అదే విధంగా మహిళ భద్రత అందరి బాధ్యత అని, వారి రక్షణకోసం ప్రత్యేకంగా షీ టీమ్స్, భరసా సెంటర్స్ పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల సీసీ కెమెరాలు పని చేస్తున్నాయని, కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రాజెక్ట్‌తో క్రైమ్ కంట్రోల్ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ... రూ. కోటీ 75 లక్షలతో భరోసా సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు తెలపారు. మహిళల సేఫ్టీ, సెక్యూరిటీ పరంగా భరోసా సెంటర్స్ కీలకంగా పని చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, బొగ్గారపు దయానంద్ గుప్త, పోలీస్ హౌసింగ్‌బోర్డ్ కార్పొరేషన్ చైర్మెన్ కోలేటి దామోదర్ గుప్త, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ చలాన్ బిల్డింగ్ ప్రారంభం
రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంప్ ఆఫీస్‌లో కొత్తగా నిర్మించిన షీ టీమ్స్, ఈ చలాన్ బిల్డింగ్‌ను హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక షీ టీమ్స్ ఏర్పాటుతో మహిళల్లో చాలా ధైర్యం వచ్చిందన్నారు. వివిధ కేసులు పెరుగుతుండటంతో కమిషనరేట్ పరిధిలో ఈ చలాన్ ఏర్పాటు మంచి నిర్ణయమని కొనియాడారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పాల్గొన్నారు.