Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
నెలకు 20వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందించే పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఈమేరకు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, జలమండలి అధికారులతో కలిసి ఛే నంబర్లోని మహారాణా ప్రతాప్ ఫంక్షన్హాలో బుధవారం అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 50వేల నల్లా కనెక్షన్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం పదివేలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారన్నారు. కార్పొరేటర్లు, జలమండలి అధికారులు తమ డివిజన్లలో ప్రతి బస్తీ, కాలనీకి వెళ్లి ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 15వ తేదీలోపు ప్రతి వినియోగదారుడు తమ నల్లా కనెక్షను ఆధార్‌ను అనుసంధానం చేసుకొని మీటర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈవిషయాన్ని అధికారులకు తెలియజేస్తే వారు కంప్యూటర్లో నమోదు చేస్తారని, అప్పటి నుంచి నల్లా నీరు ఉచితంగా వస్తుందని పేర్కొన్నారు. ఎవరైతే గడువులోగా ఆధార్ అనుసంధానం, మీటర్ ఏర్పాటు చేసుకోలేరో వారికి గడిచిన తొమ్మిది నెలల బిల్లు వస్తుందని, తప్పనిసరిగా బిల్లు చెల్లించాలని చెప్పారు. స్లమ్‌లలో నివాసముండే వారు మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ఏ బస్తీలో కూడా కలుషిత తాగునీరు, లోప్రెషర్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో కార్పొరేటర్లు దూసరి లావణ్య, వై.అమృత, బి.పద్మావెంకటరెడ్డి, కన్నె ఉమారాణి, జలమండలి జీఎం సుబ్బరాయుడు, డీజీఎంలు సతీష్, సన్యాసిరావు, మేనేజర్లు రోహిత్, కుశాల్, జకీర్, మాజిద్, భావన, వర్క్ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, నాయకులు కన్నె రమేష్ యాదవ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, శ్రీరాములుముదిరాజ్, చంద్రశేఖర్ గౌడ్, రాము, వినోద్ తదితరులు పాల్గొన్నారు.