Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి ఈ.ఉమామహేష్, రాష్ట్ర నాయకులు కె.యేసురత్నం డిమాండ్ చేశారు. బుధవారం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని నాసెన్స్ ల్యాబ్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు సందర్శించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గత వారం రోజులుగా ముగ్గురు కార్మికులు మృతి చెందారన్నారు. పరిశ్రమల అధికారులు స్పందించకపోవడంతో మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి పరిమితం కావడంతో తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాసెన్స్ పరిశ్రమ సంబంధిత సిబ్బంది ప్రమాదానికి సంబంధించిన వివరణలు పొంతన లేకుండా ఉండటం అనుమానాలకు తావిస్తుందన్నారు. 90 శాతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సహాయం, వారి కుటుంబ సభ్యులలో ఒకరికి శాశ్వతంగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెద్ద ప్రమాదం జరగకుండా సకాలంలో స్పందించిన అగ్ని మాపక సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఏఐటీయూసీ, సీపీఐ ఎల్లప్పుడు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గం కార్యదర్శి స్వామి, మండల సహాయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు సదానంద్, వెంకటేష్, రాములు, బాలరాజు, బక్కరి మల్లేష్, శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.