Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రోజులుగా నో స్టాక్
- కొవిషీల్డ్దీ దాదాపు ఇదే పరిస్థితి
- వ్యాక్సినేషన్ సెంటర్ల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
- గ్రేటర్లో సెకండ్ డోస్ కోసం 50 లక్షల మంది ఎదురుచూపు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. లబ్దిదారుల నిష్పత్తికి తగినంత టీకా సరఫరా కాకపోవ డంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ గతంతో పోలిస్తే వేగం తగ్గింది. ఇక కొవాగ్జిన్ స్టాక్ లేకపోవడంతో మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. 15 రోజులుగా కోవాగ్జిన్ టీకా పంపిణీ పూర్తిగా నిలిచి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు కోవిషీల్డ్ది కూడా అదే పరిస్థితి ఉండగా.. రెండు రోజుల నుంచి అందుబాటులోకి వచ్చింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ సెకండ్ డోస్ కోసం గ్రేటర్ పరిధిలో దాదాపు 50 లక్షల మంది ఎదురు చూస్తున్నారు.
నవతెలంగాణ-సిటీడెస్క్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 389 కేంద్రాల్లో టీకాలు ఇస్తు న్నారు. ఇప్పటి వరకు ఈ మూడు జిల్లాల్లో దాదా పు 70 లక్షల మంది వరకు టీకా తీసుకోగా.. ఇందులో 20 లక్షల మంది మాత్రమే సెకండ్ డోస్ పూర్తి చేసుకున్నారు. అంటే దాదాపు 50 లక్షల మంది వరకు రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్నారు. కొవిడ్ ఎక్కువగా ఉన్న సమయ ంలో మే, ఏప్రిల్, జూన్ నెలల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రతి రోజూ 80 వేల మంది వరకు టీకా వేసేవారు. జులై మొదటి వారం నుంచి ఈ సంఖ్య తగ్గుతూ.. 15వ తేదీ వరకు 15 వేల మందికి మించకుండా పడిపోయింది. ఇప్పటికే ఫస్ట్ డోస్ పూర్తి చేసుకుని రెండో డోస్ కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ దొరక్కపోవడంతో ప్రజలు నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్లకే వెళ్తున్నారు. అప్పటికే అక్కడ భారీగా జనం ఉండటం, లబ్దిదారులకు నిష్పత్తికి తగినంత టీకా స్టాక్ లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. జులై మొదటి, రెండో వారాలతో పోలిస్తే వారం రోజులుగా వ్యాక్సిన ేషన్ ప్రక్రియలో జోరు తగ్గింది. కొన్ని పీహెచ్ సీల్లో టీకా అందుబాటులో లేకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టేస్తుండగా.. మరికొన్ని కేంద్రాల్లో రెండు, మూడు రోజుల తర్వాత రావాలని తిప్పి పంపుతున్నారు. మొదటి డోస్‌కే ఎక్కువ ప్రాధా న్యం ఇవ్వడం.. పది రోజుల క్రితం వరకు రిస్క్ టేకర్స్‌కు టీకా వేయడంతో స్టాక్ కొరత ఏర్ప డింది. దీనికితోడు గత నెల 21వ తేదీ నుంచి 18 ఏండ్లు నిండిన వారికి కూడా టీకా వేస్తుండంతో సెకండ్ డోస్‌కు మరింత కొరత ఏర్పడింది. ప్రయివేటు హాస్పిటల్స్‌లోనూ కొరత ఉండటం, ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా టీకా వేస్తుండటంతో అందరూ ఇక్కడికే క్యూ కడుతున్నారు. ఒక్కో సెంటర్లో కేవలం 100- 200 మంది వరకే మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండ టంతో మిగతా వారు వెనుదిరుగుతున్నారు. కోవిషీల్డ్ రెండో డోసు సమయం 14 నుంచి 16 వారాలకు పెంచినా ఇబ్బందులు తప్పడం లేదు.
స్లాట్ బుకింగ్ లేక..
వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం మొదట్లో కొవిన్ యాప్, వెబ్‌సైట్‌ను ప్రజలకు అందుబా టులోకి తీసుకొచ్చింది. టీకాలు పొందాలను కున్నవారు యాప్‌లో ఆధార్ నెంబర్, ఇతర వివరాలను ఎంట్రీ చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో పరిమిత సంఖ్యలో టీకా పంపిణీకి వీలుండేది. కానీ ప్రస్తుతం యాప్, వెబ్సైట్ బుకింగ్‌లు కేవలం ప్రయివేటుకు కేంద్రాలకే పరిమితమయ్యాయి. టీకా కోసం నేరుగా కేంద్రాలకు వెళ్లొచ్చని కేంద్రం ప్రకటించడంతో ప్రజలు నేరుగా వెళ్లి ప్రూప్స్ సమర్పించి టీకాలు తీసుకుంటున్నారు. ఈ కారణంగా పలు చోట్ల వ్యాక్సినేషన్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి.