Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
సి.నారాయణ రెడ్డి గొప్ప కవిగా అందరికీ సుపరిచిత మేనని, అంతే కాక ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ కూడానని వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సాదరంగా పార్లమెంట్ సభ్యులు వారి పదవీకాలంలో వంద ప్రశ్నలు అడగటం విశేషమని, సినారె రాజ్య సభ గౌరవసభ్య హోదాలో ఉన్నప్పటికీ ఆరువందలకు పైగా ప్రశ్నలు అడిగారని వివరించారు. తెలంగాణ సారస్వత పరిషత్, సినారె కుటుంబ సభ్యల నిర్వాహణలో సినారె 90వ జయంతి పరిషత్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సాహితీ శిఖరం సినారె అని కొనియా డారు. ప్రపంచ గుర్తింపు పొందిన రామప్పపై రూపకం 1960లోనే సినారె రచించారని గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అతిథిగా పాల్గొని సినారె సినీగీత సర్వ్యస్వయం 7వ సంపుటిని ఆవిష్కరించి మాట్లాడు తూ సినారె ఇంటి సమీపంలో తాను ఉన్న సమయం లో ఆయన కవితలు ప్రథమ శ్రోతను తానేనని గుర్తు చేసుకున్నారు. శాంత బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి పాల్గొని సినారె తైలవర్ణ చిత్రపటాన్ని ఆవిష్కరించి చిత్రకారుడు జె.వీని సత్కరించారు. అధ్యక్షత వహించిన పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి 25వత్సరాలు సినారె పరిషత్ అధ్యక్షులుగా విశిష్ట కార్యక్రమాలు రూపొందించారని వివరించారు. కవి దేసిపతి శ్రీనివాస్ సినారె గీతాలను లయబద్ధంగా గానం చేశారు. సినారె సాహితీ పురస్కారంగా 25 వేల నగదు జ్ఞాపిక ప్రశంసా పత్రంతో జూకంటి జగన్నాధంను సత్కరించారు. కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య పురస్కార గ్రహీతను పరిచయం చేసారు. మంత్రి రామారావు వందన సమర్పణ చేశారు.