Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారంతో అడవులు పెరిగినరు
- హోంమంత్రి మహమూద్ అలీ
- రాచకొండలో 'లక్ష వృక్షార్చన'
నవతెలంగాణ-బోడుప్పల్
హరితహారం కార్యక్రమంతో తెలంగాణ ఆకుపచ్చ మణిహారంగా మారుతోందని, 2015తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. హరితహారంలో నెంబర్ వన్‌లో ఉన్నామని చెప్పారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు కొత్తగా నిర్మించబోయే కార్యాలయ భూమి ఆవరణలో గురువారం చేపట్టిన లక్ష వృక్షార్చన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో 2015లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. అప్పటి నుంచి అడవులు విస్తారంగా పెరిగాయన్నారు. కరోనా కాలంలో ఆక్సిజన్ గురించి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేస్తూ అడవుల ఆవశ్యకతను వివరించారు. గురువారం కమిషనరేట్ ప్రాంగణంలో 40 వేల మొక్కలు నాటామని, మిగిలిన 60 వేల మొక్కలు కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.
మేడిపల్లి రైతులకు న్యాయం చేస్తాం
కమిషనరేట్ కోసం జాగా ఇచ్చిన మేడిపల్లి రైతులకు న్యాయం చేస్తామని, మిగిలిన భూమిలో హెచ్ఎండీఏ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా లే-అవుట్ చేయిస్తామని, పనులు త్వరలో కార్యరూపం దాల్చుతాయని హోంమంత్రి భరోసా ఇచ్చారు.
డీజీపీ మహెందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు శాంతి భద్రతలతోపాటు సామాజిక బాధ్యతతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పరిణామమని అన్నారు. వన సంపదను పెంచడంతోపాటు కాపాడటంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అంతకుముందు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, ఐఎఫ్ఎస్ఆర్ఎం దోబ్రియల్, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, ఐఫ్ఎస్ ఎంజే అక్బర్, మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.జాన్ శ్యామ్సన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మెన్ కోలేటి దామోదర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాతి లక్రా, స్టీఫెన్ రవీంద్ర, మల్కాజిగిరి డీసీపీ రక్షితా కృష్ణమూర్తి పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.శ్రీనివాస్, తహసీల్దార్ ఎస్తేరు అనిత, మేడిపల్లి పీఎస్ సీఐ అంజిరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, పోచారం మున్సిపల్ చైర్మెన్ కొండల్ రెడ్డి, సినీ గేయరచయిత అనంత శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.