Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లబ్దిదారులను గుర్తించాలని ఆగస్టు 5న 'మహాధర్నా'
- సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్దిదారులను వెంటనే గుర్తించి కేటాయించాలని సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లాడు తూ.. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఫేజ్-1లో 2,052 ఇండ్లు, ఫేజ్-2లో 15,660 ఇండ్లు మొత్తం 17,712 పూర్తయ్యాయని, ఇండ్లకు రోడ్లు, మంచినీటి సంపులు, ట్యాంకులు, విద్యుత్, డ్రయి నేజీ, కమ్యూనిటీ హాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు వంటి మౌలిక వసతుల కల్పన కూడా పూర్తయిందని తెలిపారు.
అయినా లబ్దిదారులకు ఇండ్లను కేటాయించకపోవడం దారుణమన్నారు. 17,712 ఇండ్లకుగాను ప్రభుత్వం 1,687 కోట్లను ఖర్చు చేసిందన్నారు. ఇండ్ల కేటాయింపునకు ప్రభుత్వం గతేడాది నవంబర్ 6న గైడ్లైన్ జీఓను విడుదల చేసిందని గుర్తు చేశారు. జీఓ విడుదలై 8 నెలల గడుస్తున్నా లబ్దిదారుల ఎంపిక, ఇండ్ల కేటాయింపు చేపట్టకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. పేదలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా ఇండ్లను వెంటనే కేటాయించాలని కోరారు.
దశాబ్ద కాలంగా సీపీఐ(ఎం) పేదల ఇండ్ల సమస్యలపై పోరాడుతున్నదని, వేలాది మంది పేదల్ని కదిలించి భూపోరాటాన్ని నిర్వహించి, ఇండ్ల సమస్యను ఎజెండాలోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పోరాటాల ఫలితంగానే రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇండ్లు, ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లలాంటి పథకాలు వచ్చాయన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్దిదారులను గుర్తించాలని కోరుతూ ఆగస్టు 5న ఇందిరా పార్కువద్ద 'మహాధర్నా' నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నగర నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎన్.మారన్న, సి.మల్లేష్, జి.కిరణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.