Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైకుకు రూ.10, ఆటోకు రూ.30, కారుకు రూ.40
- ఆస్పత్రికి వచ్చేవారంతా పేద, మధ్యతరగతి వారే ఎక్కువ
- ఉచిత పార్కింగ్ పాలసీ ఇక్కడ వర్తించదా?
- పట్టించుకోని యాజమాన్యం
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో పార్కింగ్ దందా నడుస్తోంది. ఆరోగ్యం బాగాలేక ఆస్పతికెళితే పార్కింగ్ ఫీజు పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని మాల్స్, మల్టీప్లెక్సులు, వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజు రద్దు చేసిన సర్కార్.. ఆస్పత్రుల్లో ఫెయిడ్ పార్కింగ్‌ను ఎందుకు రద్దు చేయడం లేదని రోగులు, రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. మాల్స్, మల్టీఫ్లెక్సులు, ఇతర వాణిజ్య సంస్థల్లో అడ్డగోలు పార్కింగ్ ఫీజులను కట్టడి చేసేందుకు మూడేండ్ల కిందట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. దీంతో నగరంలో మళ్లీ పార్కింగ్ దందా మొదలైంది. ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్(ఈవీడీఎం) విభాగం నిబంధనల ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఫిబ్రవరిలో పార్కింగ్ నిబంధనలు అమలును సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. నిమ్స్‌లో మాత్రం యథేచ్ఛగా పార్కింగ్ దందా సాగుతోంది.
నిమ్స్‌లో ఇలా..
పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రికి రోజుకు వేలాది మంది రోగులు, రోగుల సహాయకులు వస్తూ పోతుంటారు. సాధారణ రోగులతోపాటు ఎంప్లాయిస్ హెల్త్ కార్డుదారులు, జర్నలిస్టు స్కీమ్ హెల్త్ కార్డుదారులు, ఆర్టీసీ, ఈఎస్ఐ, ఆరోగ్యశ్రీకార్డు దారులు వస్తున్నారు. 1500 బెడ్లు ఉన్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సుమారు 1500-2000 మంది వస్తుంటారు.
పార్కింగ్ ఫీజు
నిమ్స్ ఆస్పత్రికి అత్యధికులు పేద, మధ్యతరగతి వారు వస్తుంటారు. రోజుకు రోగులు, రోగుల బంధువులతోపాటు వచ్చిపోయేవారు సైతం 3వేలకుపైగా ఉంటారని అంచనా. 12గంటలకుపాటు పార్కింగ్ చేస్తే మోటారు సైకిల్(బైకు)కు రూ.10, ఆటోకు రూ.30, కారుకు రూ.40చొప్పున వసూలు చేస్తున్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఉచిత పార్కింగ్ ఉంటే ఇక్కడేంది ఫీజు వసూలు చేస్తున్నారని అడిగితే ఇష్టముంటే పార్క్ చేయి లేకుంటే బయటికెళ్లూ అంటూ వాహనదారులను దబాయిస్తున్నారు. పాతబస్తీలోని పేట్ల బురుజు ప్రసూతి ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఫీజు చెల్లించాలని బెదిరింపులకు గురిచేస్తున్నారు. అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదు.
మాల్స్, మల్టీఫ్లెక్కులు, సినిమా థియేటర్లు
జీహెచ్ఎంసీ పరిధిలో పార్కింగ్ విధానంపై 20 మార్చి 2018న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 30 నిమిషాల వరకు ఎలాంటి పార్కింగ్ ఫీజు లేదని, 30 నిమిషాల నుంచి గంట వరకు మాల్, మల్టీఫ్లెక్సు, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా కొనుగోలు చేసినట్టు బిల్లు చూపిస్తే ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదు. లేనిపక్షంలో అక్కడ వసూలు చేసే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాలి. గంటకంటే ఎక్కువ సమయం ఉంటే కొనుగోలు చేసిన బిల్లునుగాని, సినిమా టిక్కెట్నుగాని చూపించాలి. షాపింగ్చేసిన బిల్లు, సినిమాటిక్కెట్ ధర పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే పార్కింగ్ ఫీజు వసూలు చేయరు. పార్కింగ్ ఫీజు కంటే తక్కువగా ఉంటే నిర్ణీత పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిందేనని నిర్ణయించారు. కానీ సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ ఫీజులను వసూలు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.