Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊపిరితిత్తుల నుంచి 'బ్లాక్ అండ్ వైట్ ఫంగస్' బాల్స్ తీసివేత
- కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కారణంగా 'ఆస్పెర్గిలోమా' వచ్చిన తొలికేసుగా గుర్తింపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒకే వ్యక్తిలో బ్లాక్ అండ్ వైట్ ఫంగస్లు రెండూ ఏర్పడి, ఊపిరితిత్తులు పాడైన వ్యక్తి ప్రాణాలను ఎస్ఎల్జీ ఆసుపత్రి వైద్యులు కాపాడారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 'ఆస్పెర్గిలోమా' సమస్య గుర్తించిన మొట్టమొదటి కేసు ఇదే. దీనికి చికిత్స చేయకపోతే క్షయవ్యాధికి దారితీసేది. గతంలో చాలా బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నాసికా కుహరాలకు సోకుతున్నట్టు గుర్తించినప్పటికీ, రెండూ ఒకేసారి వచ్చి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్న మొదటి కేసు మాత్రం ఇదే.
రామనాగేశ్వరరావు అనే రోగికి తీవ్రమైన దగ్గు వచ్చి, రక్తపువాంతులు కావడంతో జులై 10న ఎస్ఎల్జీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సీటీస్కాన్ చేయగా ఎడమ ఊపిరితిత్తుల కిందిభాగం తీవ్రంగా పాడవ్వడంతో పాటు అందులో లోతైన ఖాళీ కూడా ఉందని తెలిసింది. ఈ సంవత్సరం మే నెలలో అతనికి కొవిడ్ వచ్చిన తర్వాత.. ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని గుర్తించారు. రోగి పరిస్థితి, అతడికి చేసిన చికిత్స గురించి ఎస్ఎల్జీ ఆసుపత్రుల కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ వివేక్బాబు బొజ్జావర్ మాట్లాడుతూ 'రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నవారికి ఆస్పెర్గిలోమా అనే సమస్య వస్తుంది. టీబీతో బాధపడేవారిలో ఇది సర్వసాధారణం. కానీ కొవిడ్-19 వచ్చినవారిలో తొలిసారి దీన్ని గుర్తించాం. దీనివల్ల ఊపిరితిత్తులు పాడవ్వడం, ఖాళీలు ఏర్పడటం, వ్యాధి ఇంకా ముదిరితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రోగి విషయంలో రక్తపు వాంతులు కావడాన్ని బట్టి వైరస్ బాగా లోతుగా విస్తరించిందని తెలిసింది. దాంతో అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది' అని అన్నారు.