Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మలక్‌పేట్
అర్హులందరికీ రేషన్ కార్డులిస్తామని, తెలంగాణలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని సరూర్‌నగర్, ఆర్కెపురం డివిజన్లకు సంబంధించి 1400 మందికి వాసవి కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త ఆహార భద్రత కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కాలంలో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన రేషన్‌ను ప్రజలకు సరఫరా చేయడంలో డీలర్ల పాత్ర ఎంతో గొప్పదన్నారు. నూతనంగా 3 లక్షల 9 వేల రేషన్ కార్డులు మంజూరు చేశారని చెప్పారు. రాష్టంలో 90.5 శాతం ప్రజలకు రేషన్ బియ్యం అందుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 3 లక్షల 9 వేల 83 కార్డుల ద్వారా 8 లక్షల 65 వేల 430 మందికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రభుత్వం ప్రతీ నెల రూ. 231 కోట్లతో సంవత్సరానికి రూ. 2, 766 కోట్లను ప్రజా పంపిణీ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నూతన కార్డు దారులకు ఆగస్టు నెల నుంచి రేషన్ అందిస్తారని చెప్పారు. నెలకు అదనంగా రూ. 14 కోట్ల విలువ గల 5, 200 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 87.41 లక్షల కార్డులు ఉండగా, కొత్త కార్డులతో కలిపి 90.50కి చేరాయని, 2 కోట్ల 88 లక్షల లబ్ధిదారులకు నెలకు ఆరు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో రేషన్ కార్డు దారులతో పాటు ఉచిత బియ్యం, నగదు సహాయాన్ని వలస కార్మికులకు కూడా అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి సీఎం అండగా నిలబడ్డారని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ శ్రీధర్, కందుకూర్ ఆర్డీవో వెంకటాచారి, సివిల్ సప్లై డీఎస్వో రాథోడ్, ఏఎస్వో సరోజ, సరూర్ నగర్ తహసీల్దార్ రామ్మోహన్, టీఆర్ఎస్ ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్, ప్రధాన కార్యదర్శి పెండ్యాల నగేష్, సాజీద్, బేర బాలకిషన్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జై శ్రీమన్నారాయణ, కొండల్ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, జిల్లాల క్రిష్ణారెడ్డి, లింగస్వామి గౌడ్, శ్యాం గుప్త, ఇస్మాయిల్, చామల శైలజ, ఊర్మిళరెడ్డి, యాదవ్ రెడ్డి పాల్గొన్నారు.