Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్ రెడ్డి
నవతెలంగాణ-రాంనగర్
కరోనా నేపథ్యంలో విద్యకు దూరమవుతున్న బడీడు బాలబాలికలను గుర్తించి, వారికి నాణ్యమైన విద్యను అందించాలని ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య కళానిలయంలో ఎంవీ ఫౌండేషన్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగం సంక్షోభం-సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పేరుతో కార్పొరేట్, ప్రయివేటు విద్యాసంస్థలు పేద, మధ్య తరగతి ప్రజల నుంచి అధిక ఫీజులను దోపిడీ చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగంలోని విద్య పేద పిల్లలకు అందని ద్రాక్షగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఆన్లైన్ బోధనకు పేదవిద్యార్థులను చేరువచేయాలన్నారు. మొబైల్స్, టీవీ, ఇతరత్రా ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రభుత్వమే సమకూర్చాలన్నారు. ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి విద్యారంగం పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆయా సంఘాల రాష్ట్ర ప్రతినిధులు జి.వేణుగోపాల్, భాగ్యలక్ష్మి, కవిత, ప్రకాశ్ పాల్గొన్నారు.