Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోకిరీల ఆగడాలకు చెక్ పెడుతున్న షీ టీమ్స్
- రాచకొండలో 36 బాల్య వివాహాలకు అడ్డుకట్ట
- లింగనిర్ధారణ కేంద్రాలపై నిఘా 9 మంది డాక్టర్ల అరెస్టు
- అన్ని విభాగాల్లో ప్రత్యేక నిఘా పెట్టిన షీ టీమ్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాచకొండ పరిధిలో షీ టీమ్స్ మహిళల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇంటి నుంచి కాలుబయటపెట్టిన మహిళలు, యువతులు తిరిగి సురక్షితంగా ఇంటికి చేరే వరకు భద్రత జనంలో ఉంటూనే రక్షణ కల్పిస్తున్నాయి. మహిళల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాయి. మహిళలు ప్రయాణిస్తున్న ఆటోలు, కార్లు, క్యాబ్‌లపై సేఫ్‌గా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ పరిధిలో షీ టీమ్‌లు దాదాపు 18 రకాల సేవలను అందిస్తున్నాయి. మహిళలను వెంటపడి వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలతోపాటు రెచ్చిపోతున్న మైనర్లను కట్టడి చేస్తున్నాయి. దాంతో రాచకొండ కమిషనరేట్‌కు షీ టీమ్స్ స్పెషల్ ఐకాన్‌గా నిలుస్తున్నాయి.
3119 ఆకతాయిలు, 421 మైనర్లు
ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు కాలేజీలు, చౌరస్తాలు, బస్టాండ్స్, వాకింగ్ ప్లేసెస్తోపాటు మెట్రో రైళ్లు ఇతర ప్రాంతాల్లో డెకారు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆరేండ్ల కాలంలో (2014 నుంచి 2021వరకు) 2785 కేసులు నమోదు కాగా, 1119 ఎఫ్ఐఆర్ చేశారు. 1469 పెట్టీకేసులు నమోదు చేయగా, 197 మంది పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 3119 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. అందులో 2698 మంది మేజర్లుండగా, 421 మంది మైనర్లున్నారు.
బాల్య వివాహాలను అడ్డుకున్న షీ టీమ్స్
రాచకొండ పరిధిలో షీ టీమ్స్ 110 బాల్య వివాహాలను అడ్డుకున్నాయి. బోనగిరి, చౌటుప్పల్, ఇబ్రాహీం పట్నంతోపాటు తదితర ప్రాంతాల్లో గుట్టుగా సాగుతున్న వాల్య వివాహాల గురించిన సమాచారం తెలుసుకుని అడ్డుకోవడంతోపాటు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
షీ ఫర్ హర్
మహిళల సేఫ్టీకోసం 'షీ ఫర్ హర్' కార్యక్రమానికి రాచకొండ సీపీ మహేష్‌భగవత్ శ్రీకారం చుట్టారు. ప్రతి కాలేజీలో ఇద్దరు అమ్మాయిలతో టీమ్‌లను ఏర్పాటు చేశారు. తమకుతాము ఎలా రక్షించుకోవాలో ప్రత్యేక శిక్షణ అందించారు. కాలేజీలు, స్కూల్స్, ఇతర కార్యాలయాల్లో దాదాపు 5606 అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఐటీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సురక్షిత ప్రయాణం కోసం 'షీ షెటిల్స్' బస్సులను 2019, ఆగస్టు 17న ప్రారంభించారు. అంతేకాకుండా క్యాబ్‌లు ఆటోల్లో ప్రయాణించే వారికి సైతం భద్రత కల్పించే విధంగా 'మై ఆటో, మై క్యాబ్ ఈజ్ సేఫ్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
బాలికలకు రక్షణగా
మహిళలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా వేసిన షీ టీమ్స్ యాదగిరిగుట్టలో 36 మంది మైనర్లను రక్షించాయి. అంతేగాక ముగ్గురు చిన్నారులను విక్రయిస్తుండగా సమాచారం అందుకుని వారిని రక్షించారు. ఇక లింగ నిర్ధారణ చేస్తున్న 9 మంది ఎంబీబీఎస్ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.