Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
వరస దోపిడీలకు పాల్పడుతూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న అంతరాష్ట్ర మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌తోపాటు అతనికి సహకరిస్తున్న నిందితున్ని, రిసీవర్‌ను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 176 గ్రాముల బంగారు ఆభరణాలు, 2000గ్రాముల వెండి, ద్విచక్రవాహనంతోపాటు సెల్‌ఫోన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.10లక్షలుంటుందని సీపీ తెలిపారు. శనివారం హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి సీపీ అంజనీకుమార్ వివరాలను వెళ్లడించారు. పుణేకు చెందిన సంగత్ సింగ్ అజ్మేర్‌సింగ్ కళ్యాణి వ్యాపారం చేస్తున్నాడు. అయితే అందులో ఆశించిన లాభాలు రాకపోవడంతో దోపిడీలను చేయాలని లక్ష్యంగా చేసుకుని 2005 నుంచి దోపిడీలను చేయడం ప్రారంభించాడు. తన స్నేహితుడైన అక్షరు పొపాట్ పదులేతో కలిసి నాలుగు దోపిడీలను చేశాడు. పుణేలో బంగారం దుకాణంలో చోరీ చేశారు. ద్విచక్రవాహనంపై తిరుగుతూ టార్గెట్ చేసుకున్న ఇండ్ల తాళాలను ఒక ఇనుప రాడ్‌తో తొలిగించి ఇంట్లోకి ప్రవేసించి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు విలువైన వస్తువులు, నగదును దోపిడీ చేసి ఉడాయిస్తారు. పోలీసుల కండ్లుగప్పేందుకు ఎప్పటికప్పుడు మకాం మారుస్తారు. ఇదే తరహాలో సంగారెడ్డికి మకాం మార్చిని నిందితులు ద్విచక్రవాహనానికి నెంబర్ ప్లేట్ మార్చి హైదరాబాద్‌లో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ నెల మారేడ్‌పల్లి, కాచిగూడా, అంబర్పేట్ ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన నిందితులు పరారయ్యారు. ప్రత్యేక నిఘా వేసిన మారేడ్‌పల్లి పోలీసులు, టాస్క్ఫోర్సు పోలీసులు నిందితులను అరెస్టుచేశారు. వీరితోపాటు దోపిడీ చేసిన సొత్తును కొనుగోలు చేస్తున్న విక్రమ్ సింగ్ రాజ్పుత్రును అరెస్టు చేశారు. నిందితులు మహారాష్ట్ర, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 17 దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నాయని సీపీ తెలిపారు.