Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముడుపులు ముట్టిన నిర్మాణలపై ఈగ వాలనియ్యని స్థానిక నాయకులు
- నెరవేరని టాస్క్ ఫోర్స్ టీం పర్యవేక్షణ
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇష్టారాజ్యంగా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు ఉంటాయని బోడుప్పల్ టాస్క్ఫోర్స్ టీం హెడ్ మేడిపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర అన్నారు. జిల్లా కలెక్టర్ నేతత్వంలోని టాస్క్ఫోర్స్ టీం ఆధ్వర్యంలో శనివారంనాడు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఈ మేరకు టాస్క్ఫోర్స్ టీం గుర్తించిన కమర్షి యల్ షెడ్ నిర్మాణాలు, అనుమతులకు మించిన నిర్మాణాలను జేసీబీల సహా యంతో కూల్చివేశారు. అయితే అధికారులు చేపట్టిన ఈ చర్యలపై అనేక విమర్శ లు వస్తున్నాయి. కేవలం ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం మాత్రమే తూతూ మంత్రంగా ఈ కూల్చివేతలు చేపట్టారని పలు పార్టీలకు చెందిన నేతలు వాపోతున్నారు. ఇందులో సుమారు 30 నిర్మాణలు అనుమతి లేని నిర్మాణాలుగా గుర్తించిన అధికారులు ఇందులో ఇప్పటికే ముడుపులు అందిన నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అక్రమ నిర్మాణాలు ఇవేనా?
బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో వందల సంఖ్యలో అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలుండగా శనివారం నాడు కేవలం పదుల సంఖ్యలో మాత్రమే చర్యలు చేపట్టడంతో అధికారులపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇందులో కూడా నామమాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో ముడుపులు అందిన నిర్మాణల జోలికి వెళ్ళకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, వారి బంధుగణం నిత్యం అధికారుల వెంటే తిరుగుతూ ఉండడంతో కూల్చివేతలు సాఫీగా సాగలేదు. ఇప్పటికైనా అధికారులు అనుమతి లేకుండా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకొని కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచుతారా, లేక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గుతారా చూడాలి.
వసూళ్ళ కమిటీ కనుసన్నల్లోనే కూల్చివేతలు
కత్తి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి,
బోడుప్పల్ నగర పాలక సంస్థ
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో శనివారంనాడు చేపట్టిన కూల్చివేతల కార్యక్రమం కేవలం కార్పొరేషన్ పరిధిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న వసూళ్ళ కమిటీ కనుసన్నల్లో మాత్రమే జరిగాయని కాంగ్రెస్ పార్టీ బోడుప్పల్ నగరపాలక సంస్థ కమిటీ అధికార ప్రతినిధి కత్తి వెంకట్రెడ్డి ఆరోపించారు. పేరుకు మాత్రమే టాస్క్ఫోర్స్ కమిటీ అంటూ హడావుడిచేశారని విమర్శలు చేశారు. బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1000 పైగా అక్రమ నిర్మాణాలుంటే కేవలం కంటితుడుపు చర్యలుగా పదుల సంఖ్యలో మాత్రమే చర్యలు చేపట్టడం చూస్తుంటే వీటి నుండి ఇప్పటి వరకు వసూళ్ళ కమిటీకి ముడుపులు అందలేదనే అర్థ్దం చేసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పారదర్శకంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతానమని హెచ్చరించారు.