Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యం
- హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం
నవతెలంగాణ-నారాయణగూడ
దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటుతోనే పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారం అవుతాయని తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం అన్నారు. ఈమేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో సౌత్ ఇండియా అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో జస్టిస్ చల్లా కోదండరాం పదవీ విరమణ సన్మాన సభ జేఏసీ అధ్యక్షులు సుధా నాగేందర్ అధ్యక్షతన నిర్వహించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ వామన్ రావు హాజరై ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ చల్లా కోదండరాం మాట్లాడుతూ సమాజంలో పౌరులు బాధ్యతాయుతంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. అప్పీల్ కేటగిరిలో 50 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, జడ్జి ద్వారా ఏడాదికి 30 కేసులు మాత్రమే పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. అనంతరం జస్టిస్ వామన్ రావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి, సంస్థ, ప్రతి క్షణం సమాజం బాగు కోసం ప్రయత్నం చేస్తే సమాజం బాగుపడుతుందన్నారు. మంచి పనులు చేస్తే సమాజం గుర్తిస్తుందన్నారు. న్యాయ వ్యవస్థకు జస్టిస్ చల్లా కోదండరాం చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మెన్ సునీల్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు పొన్నం అశోక్ గౌడ్, వెంకటేశ్వరి, డీకే.శ్రీధర్, ఉపాధ్యారు పాల్గొన్నారు.