Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంకా అందని ఉచిత యూనిఫామ్
- ఏటా విద్యాసంవత్సరంలో విద్యార్థులకు అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఏటా సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ (ఏకరూప దుస్తులు) అందిస్తోంది. వీటిని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ద్వారా విద్యార్థులకు అందజేస్తారు. కరోనా కారణంగా బడులు మూతపడినప్పటికీ గతేడాది విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్‌తో పాటు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ జులై 1 నుంచి ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈక్రమంలో 3 నుంచి పదవ తరగతి విద్యార్థులు డిజిటల్ క్లాసులకు హాజరవుతున్నారు. కాగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభమై నెలరోజులు కావొస్తున్న విద్యార్థులకు ఇంకా యూనిఫామ్ అందకపోవడంతో సివిల్ డ్రెస్‌ల్లోనే పాఠాలు వినాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలావుంటే ఈ విద్యాసంవత్సరం ఇంకా కూడా క్లాత్ కొనుగోలు చేయలేదని, బట్టలు రావడం కష్టమేనని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏటా ఇచ్చే ఈ రెండు జతల డ్రెస్సులతో నిరుపేద కుటుంబాల పిల్లలు ఎంతో సంతోషం వ్యక్తం చేసేవారు. కొత్తబట్టలతో క్లాసులకు వచ్చేందుకు సుముఖత చూపించేవారు. వారి తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించే వారని పలువురు టీచర్లు చెబుతున్నారు.
కరోనా కారణంగా గతేడాది పాఠశాలలు మూత పడ్డాయి. స్కూళ్లు తెరుచుకోకపోవడంతో ఆన్లైన్ ద్వారానే క్లాసులు నిర్వహించారు.అదే సమయంలో ప్రతీ విద్యాసంవత్సరంలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు రెండు జతల ఏకరూప దుస్తులు కుట్టించడంతో పాటు కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మొత్తం 944 ఉన్నాయి. వీటిలో 1 నుంచి 10వ తరగతి వరకూ 1.56లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మొత్తం 3,08,854 యూనిఫాంలను పంపిణీ చేయగా.. ఇందుకోసం టెస్కో నుంచి సుమారు 8,07987.60 క్లాత్‌ను నేరుగా మండల పాయింట్లకు చేరవేశారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలల పరిధిలోని టైలర్లకు కుట్టేందుకు హెడ్మాస్టర్లు ఇచ్చారు. ఈ ప్రక్రియ అంతా గతేడాది మే-జూన్ చివరలోనే పూర్తి చేయగా.. ఆగస్టు రెండోవారంలో విద్యార్థులను స్కూళ్లకు పిలిపించి అందించారు. ఏకరూప దస్తులు కట్టేందుకు టైలర్లకు జతకు రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 చెల్లిస్తారు. బాలురకు షర్ట్, ప్యాయింట్, నిక్కర్, ఆడపిల్లలకు చిన్నవారికి షర్ట్, పర్కిన్ క్లాత్, పెద్దవారికి పంజాబీ డ్రస్ క్లాత్ ఉంటుంది.
ఈ ఏడాది నేటికీ ఊసేత్తని సర్కారు..!
ఆన్లైన్ బోధన నేపథ్యంలో విద్యాశాఖ గతేడాదిలాగే ఈసారి కూడా ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసింది. కానీ పిల్లలకు ఏటా ఇచ్చే స్కూల్ యూనిఫామ్ మాత్రం ఇవ్వలేదు. వేసవి కాలంలోనే పాఠశాలలకు రావాల్సిన క్లాత్ నేటికీ ఇంకా రాలేదు. అసలు ఈ ఏడాది యూనిఫామ్స్ ఇచ్చే యోచనలో సర్కారు లేనట్టుగా ఉందని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. అయితే కరోనా దెబ్బకు చాలా కుటుంబాలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే సమయంలో వేల రూపాయలు ఫీజులు చెల్లించలేక తమ పిల్లలను ప్రయివేటు బడుల నుంచి సర్కారు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. రెండేండ్లుగా రికార్డు స్థాయిలో సర్కారు బడుల్లో ప్రవేశాలు పెరిగాయి. ఇలాంటి సమయంలో ప్రతీ ఏటా ఇచ్చే స్కూల్ యూనిఫామ్ ఇవ్వకపోవడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు నిరుత్సాహపడుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం అందజేసే ఉచిత యూనిఫామ్స్‌తో పిల్లలకు బట్టలు కుట్టించే భారం తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వ ఇవ్వకపోవడంతో కరోనా కష్టకాలంలో అప్పులు చేసి కుట్టించాల్సి వస్తుందని పేరెంట్స్ వాపోతున్నారు.
స్కూల్ యూనిఫాం ఇవ్వలేదు : ఆర్.రోహిణీ
పాఠశాలలు బంద్ ఉండడం, ఆన్లైన్ క్లాసులు నడుస్తుండడంతో గతేడాది మాదిరిగా జిల్లాకు క్లాత్ సరఫరా కాలేదు. దీంతో పిల్లలకు యూనిఫామ్స్ అందించలేదు. దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి విద్యార్థులందరూ డిజిటల్ పాఠాలు వినేలా గట్టి చర్యలు తీసుకుంటున్నాం.