Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీ కనిపిస్తే కబ్జా, రైతులను మచ్చిక చేసుకుని సాగుభూములతో ప్లాట్ల దందా
- హయత్‌నగర్ పరిధిలో గజం భూమి రూ.50 నుంచి 80 వేలు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-హయత్‌నగర్
రైతును రాజును చేస్తామని ఓ వైపు ప్రభుత్వాధినేతలు చెప్తుంటారు. కానీ ఆచరణలో మాత్రం కొన్నిచోట్ల బికారీలుగా మారుస్తున్న వైనం కళ్లకు కడుతోంది. ప్రభుత్వ భూమి ఎక్కడ ఖాళీ కనిపించినా అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా వాలిపోతోంది. వెంచర్లు వేసి, ప్లాట్లుగా మార్చి కోట్లకు పడగలెత్తుతోంది. అది అంతకే పరిమితమై లేదు. చివరకు సాగు భూముల్ని కూడా వదలడంలేదు. అమాయక రైతులను మచ్చికచేసుకునో, డబ్బు ఆశతోనో, బెదిరింపులతోనో లొంగదీసుకుని వారికి చెందిన భూములను కూడా ప్లాట్లుగా మార్చుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇదంతా ఎక్కడో, ఏ మారుమూల పల్లెలోనో కాదు, గ్రేటర్ హైదరాబాద్ శివారుప్రాంతమైన హయత్‌నగర్‌లోనే జరుగుతోంది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదంటే దీనివెనుకాల పెద్ద మాఫియానే ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా ప్రతినిధుల అండదండలు లేనిదే రియల్ మాఫియా ఈ విధంగా రెచ్చపోతుందా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యమని రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం రియల్ మాఫియా ఆగడాల నుంచి మాత్రం రైతులను, బాధితులను ఎందుకు కాపాడటం లేదన్న సందేహాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
హయత్‌నగర్ పరిధిలోని కొందరు రైతులకు1962లో అప్పటి ప్రభుత్వం సాగుచేసుకొని బతకడం కోసం భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి సదరు రైతులు ఆ నేలతల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అయితే కొందరు రియల్టర్ల కన్ను ఆ భూములపై పడింది. పైగా ఇక్కడ గజం ధర రూ. 40 నుంచి 80 వేలు పలుకుతుండటంతో ఎలాగైనా ఆ భూములను కాజేయాలని రియల్ ఎస్టేట్ మాఫియా పక్కాప్లాన్‌తో పావులుకదిపింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానిక ఎస్సీ రైతులకు డబ్బుల ఆశ చూపి మచ్చిక చేసుకున్నారు. వారి కుటుంబ ఆర్థిక అవసరాలను, బలహీనతలను ఆసరాగా తీసుకొని కోట్లాది రూపాయల విలువచేసే భూములను తనఖా పేరుతో రైతులకు అప్పులు ఇచ్చి, అవి చెల్లించకపోవడంతో భూములను లాక్కోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇలాంటి మరో ఘటన హయత్‌నగర్ మండలం అన్మగల్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడి సర్వే నెంబర్ 255లో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 74 ఎకరాల, 37 గుంటల సాగు భూమిని ఒక్కొక్క కుటుంబానికి ఒక ఎకరం చొప్పున 37 ఎకరాలకు గాను 37 మంది ఎస్సీలకు ఏక్‌సాల్ (ఒక సంవత్సరం) పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. అదేవిధంగా 13 ఎకరాలకు 13 మంది ఎస్సీ రైతులకు అసైన్డ్ భూములకు పట్టాలను అందజేసింది. 13 ఎకరాల అసైన్డ్ భూములకు 1986లో క్రయ, విక్రయాలు, లీజ్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయని అప్పట్లో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు రావడంతో ఆ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సాల్ పట్టాలను ప్రభుత్వం రద్దు చేయగా 2005లో రెవెన్యూ అధికారులు మిగిలిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అసైన్డ్ భూముల్లో రామకృష్ణ సొసైటీ పేరుతో లే అవుట్ చేసి క్రయ, విక్రయాలు చేసిన విషయం తెలిసిందే. 2012లో రెవెన్యూ అధికారులు 255 సర్వేలోని అక్రమ వెంచర్లను నిషేధించాలని కోరుతూ.. స్థానిక హయత్‌నగర్, వనస్థలిపురం కార్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. అయినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక రెవెన్యూ అధికారులు మారినప్పుడల్లా హయత్‌నగర్ పరిధిలో కబ్జాల పర్వం అధికమవుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. 255 సర్వేనెంబర్ గల భూమిని రియల్టర్లు కబ్జాచేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పందించి 'రియల్ మాఫియా' ఆగడాలకు అడ్డుకట్టవేస్తారో లేదో చూడాలి మరి !
ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలు
హయత్‌నగర్ పరిధిలోని అమన్‌గల్‌లో సర్వే నెంబర్ 255లో ముదిరాజ్ కాలనీ ఏర్పాటు కోసం 15 ఎకరాల 30 గుంటలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ హాస్టల్, బీరప్ప దేవాలయానికి 4.7 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కొత్తగా 58, 59 జీవోలను తీసుకురావడంతో ముదిరాజ్ కాలనీ, రామకృష్ణ సొసైటీ కాలనీవాసులు కలిసి 58 జీవో కింద 159 మంది దరఖాస్తు చేసుకోగా 2.10 ఎకరాలకు ప్రభుత్వం పట్టాలను జారీ చేసింది. 59 జీవో కింద 115 మంది దరఖాస్తు చేసుకోగా 94 మందికి పట్టాలను జారీ చేసి 21 మంది దరఖాస్తులను తిరస్కరించింది. ప్రస్తుతం ఇక్కడి ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వెలుస్తున్నా, రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు.