Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
- రాంపల్లిలోని ఇండ్ల సందర్శన
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేక ప్రాంతాల్లో పూర్తయినప్పటికీ పేదలకు కేటాయించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని, లబ్ధిదారులను గుర్తించి, ఇండ్లను అందజేయాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ డిమాండ్ చేస్తోంది. సీపీఐ(ఎం) నగర బృందం మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో అధికారులు చెబుతున్న వివరాల మేరకు దాదాపు 50 వేల ఇండ్లు పూర్తయి కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కానీ ప్రభుత్వమే చిన్న చిన్న పనులు పూర్తిగా కాలేదనే పేరుతో జాప్యం చేస్తున్నదని విమర్శించారు. నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. ఈ దరఖాస్తుల పరిశీలన ఇప్పటికీ ప్రారంభమే కాలేదని, లబ్ధిదారులను గుర్తించేది ఎప్పుడు? కేటాయించేది ఎప్పుడో? అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా కేటాయించకుండా పొడిగించే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం పేదలను ఇబ్బందికి గురిచేయడం అన్యాయమన్నారు. రాంపల్లి ప్రాంతంతోపాటు నగర శివారులో పూర్తయిన ఇండ్లను కేటాయించాలని, లబ్ధిదారుల గుర్తింపు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఈనెల 5న ధర్నాచౌక్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాంపల్లిలోని ఇండ్లను సందర్శించిన వారిలో సీపీఐ(ఎం) అంబర్పేట్ జోన్ కార్యదర్శి మహేందర్, ఘట్కేసర్ సీపీఐ(ఎం) నాయకులు సబితా, సునీత ఉన్నారు.