Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 5న మహాధర్నాను విజయంతం చేయాలని పిలుపు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్/ముషీరాబాద్
తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు గడిచినా పేదల సొంతింటి కల నేటికి నెరవేరలేదని జూబ్లీహిల్స్ జోన్ సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లనుఅర్హులందరికీ కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టబోయే మహాధర్నాకు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్, వినాయక నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఫ్లకార్డ్స్ ప్రదర్శించి ప్రచారం నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం సుమారు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకుని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారన్నారు. ఇండ్ల కోసం అర్జీ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొనాలని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే అందరికీ ఇండ్లు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ అశోక్, సాయి శేషగిరిరావు, స్వామి, బిక్షపతి, మాల్యాద్రి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికి కరపత్రాల పంపిణీ
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
2017 చివరి నాటికి లక్ష్యం పూర్తి చేస్తామని ఇండ్లు ఇవ్వకపోతే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లే అడగమని అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. నేటికీ నగరంలో లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లు 3660 మాత్రమే అని పేర్కొన్నారు. శివారులో వేల సంఖ్యలో ఇండ్ల నిర్మాణం పూర్తి అయినప్పటికీ కేటాయించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఆగి ఎన్నికల ముందు కేటాయింపులు జరిపి రాజకీయ లబ్ది పొందాలని ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచిస్తుందని విమర్శించారు. ఈనెల 5వ తేదీన ఇందిరా పార్క్లో జరిగే ధర్నాలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముషీరాబాద్ జోన్ కన్వీనర్ ఎం దశరథ్, నాయకులు జి. రాములు, శ్రీరాములు, జాకీర్, రమేష్, నాగేశ్వరరావు, ఎల్లయ్య, వెంకటయ్య, మధు, తదితరులు పాల్గొన్నారు.