Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో పాత, కొత్తవి 6.36 లక్షలకుపైగా కార్డుదారులు
- 39 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా
- తొలిరోజు 29వేల కార్డుదారులకు రేషన్ అందజేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
జిల్లాలో కొత్తకార్దుదారులకు రేషన్ బియ్యం పంపిణీ సజావుగా కొనసాగేలా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పాత, కొత్త కార్డు దారులకు కలిపి రేషన్ బియ్యం అందిస్తుండగా.. కొత్తగా కార్డుదారులందుకున్న వారు దుకాణాలకు వచ్చి రేషన్ బియ్యం తీసుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్ల క్రితం తెల్లరేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకుని.. వస్తదో.. రాదోనని దిగులుతో ఉన్న తమకు ప్రభుత్వం ఎట్టకేలకు తీపికబురు అందించడమేగాక ఇయ్యాలా రేషన్ బియ్యం పంపిణీ చేయడంతో లబ్ధిదారుల ఆనందానికి అవదుల్లేకుండాపోయింది. ఇదే సమయంలో జిల్లావ్యాప్తంగా సుమారు 30,287 మంది దరఖాస్తుదారుల దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇన్నేండ్లుగా ఎదురుచూస్తున్న తమకు సర్కారు మొండిచేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం దరఖాస్తుదారుల స్థితిగతులతో పాటు అన్ని కోణాల్లో విశ్లేషించుకున్న తర్వాతే స్థితిమంతులుగా నిర్ధారణకు వచ్చాకే అలాంటి కార్డులు పక్కకు పెట్టామని చెబుతున్నారు. ఏదో సాకు చూపి కార్డు కట్ చేసినట్టు పలువురు వాపోతుండగా.. తిరస్కరించిన వాటిని మరోసారి పునర్ పరిశీలించే అవకాశాలు ఉంటే చూడాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీ కార్డుదారుకు నవంబర్ వరకు ఉచితంగా అయిదుకిలోల బియ్యం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్రం కోటాకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కోటా సైతం జోడిస్తోంది. అయితే గత నెలలో కేవలం కేంద్రం కోటాతోనే సరిపెట్టగా.. ఈసారి గత నెల, ఈ నెల కోటా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 10 కిలోలు, కేంద్ర కోటా 5కిలోలు కలిపి లబ్దిదారు ఒక్కొక్కరికి 15కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నట్టు పేర్కొన్నారు.
తొలిరోజు 29వేల కార్డుదారులకు రేషన్..
జిల్లాలో ప్రస్తుతమున్న తెల్లరేషన్ కార్డుదారులకు కేంద్రం, రాష్ట్ర కోటాతో కలిపి ఈ నెలలో 36వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం కానుంది. ఇప్పటికే అన్ని స్టాక్ పాయింట్లకు బియ్యం చేరుకోగా, డీలర్లకు సరఫరా పూర్తిచేస్తున్నారు. సోమవారం బోనాల పండుగ సెలవు నేపథ్యంలో మంగళవారం నుంచి పంపిణీ ప్రారంభించగా.. తొలిరోజు 29వేల కార్డుదారులు రేషన్ బియ్యం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 670 రేషన్ దుకాణాలకు గాను 613 పనిచేస్తుండగా.. కరోనాతో పాటు వివిధ కారణాలతో 25 మంది డీలర్లు మరణించగా.. మొత్తం 82 దుకాణాల వరకు పనిచేయడం లేదు. ఈ షాపుల్లోని కార్డులతో పాటు కొత్తగా మరిన్ని వచ్చి చేరాయి. దీంతో ఆయా దుకాణాల వద్ద రద్దీ నెలకొంటుంది. ప్రతి నెలా ఒకటి నుంచి 15 వరకు మాత్రమే డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో చాలా దుకాణాల వద్ద బియ్యం కోసం లబ్ధిదారులు బారులు తీరాల్సిన పరిస్థితి. అంతేకాకుండా చాలామందికి దూరం భారం కూడా అవుతోందని, లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా డీలర్ల సంఖ్య పెంచితే ఇబ్బందులు ఉండవని కార్డుదారులు చెబుతున్నారు.
సంతోషంగా ఉంది : బోనం శిరిష, బాగ్ అంబర్పేట
ఏడాది క్రితం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేశాం. ఇటీవల ప్రభుత్వం కొత్త కార్డులు జారీకి ఒకే చెప్పడంతో వారం రోజుల క్రితమే మీ-సేవ ద్వారా కంప్యూటర్ ప్రింట్ తీసుకున్నాం. మేము నలుగురం ఉన్నాం. ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున 40కిలోలు బియ్యం ఇచ్చారు.