Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాకింగ్‌కు వెళ్లేవారే టార్గెట్
- నిందితుల అరెస్టు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారిని బెదిరిస్తూ టార్గెట్ చేసుకుని పోలీసులమంటూ నిలువు దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ పోలీసుల ముఠా రైన్బజార్ పోలీసులకు చిక్కింది. ఐదుగురు ముఠాలోని నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలతోపాటు రూ.4500 నగదును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఇన్స్పెక్టర్ అంజనేయులుతో కలిసి ఏసీపీ బి. ఆనంద్ తెలిపిన వివరాల మేరకు పిసల్ బండాకు సయ్యద్ అక్రమొద్దీన్, యాకుత్‌పురాకు చెందిన మాహ్మద్ ఇమాముద్దీన్ ఆసీఫ్, సంతోష్‌నగర్‌కు చెందిన మాహ్మద్ ఆయాన్ ఖాన్, తలాబ్‌కట్టకు చెందిన సయ్యద్ అమీర్ వాజీద్‌లు ఒక ముఠాగా ఏర్పాడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేసిన నిందితులు రైన్బజార్, చార్మినార్, యాకుత్‌పురా తదితర ప్రాంతాల్లో ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారిని టార్గెట్ చేసుకుని పోలీసుల మంటూ వారిని బెదిరించేవారు. బాధితుల వద్దగల సెల్‌ఫోన్‌తోపాటు నగదు, విలువైన వస్తువులను లాకెళ్తున్నారు. ఇదే తరహాలో రెగ్యులర్‌గా వాకింగ్ వెళ్లే బిహార్‌కు చెందిన వ్యక్తిని టార్గెట్ చేశారు. వాకింగ్ వెళ్లిన అతన్ని గత నెల 26న అడ్డుకుని పోలీసులమంటూ బెదిరించారు. అతని వద్దగల సెల్‌ఫోన్ లాక్కున్నారు. అంతటితో ఆగకుండా బాధితుని రూంకు వెళ్లి నగదును లాక్కుకుని ఎవరికైనా చెప్పితే స్టేషన్‌కు తీసుకెళ్తామని బెదిరించారు. అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్ని కోణాల్లో విచారించిన అదనపు ఇన్స్పెక్టర్ బి.వరప్రసాద్ ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.