Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న బడ్జెట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బడ్జెట్ పాఠశాలల యజమాన్యాలు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను వివరించి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9వేల బడ్జెట్ పాఠశాలలో ఆన్లైన్ విద్యతో గ్రామాల్లో చాలా మంది విద్యార్థులు మొబైల్ లేక, వైఫై సౌకర్యంలేక అర్థం కాని పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ లేకపోవడంతో హాజరుశాతాన్ని తీసుకోకపోవడంతోపాటు యాజమాన్యాలకు తెలియకుండానే విద్యార్థులను పై తరగుతులకు ప్రమోట్ చేయడంతో వారి తల్లిదండ్రులు విద్యపై శ్రద్ద చూపడం లేదన్నారు. ప్రయివేటు బడ్జెట్ పాఠశాలలు అన్ని కూడా వెంటిలేటర్ మీద ఉన్నాయని, అందులో పని చేసే సిబ్బంది అద్దెలు చెల్లించుకోలేక నానా అవస్థలు పడుతున్నారన్నారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలల భవనాలకు పన్ను, ఎలక్ట్రిసిటి బిల్లులు, వాటర్ బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని కోరారు. సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే వరకు జీవో ప్రకారం ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో చైర్మెన్ శివయ్య, ముఖ్య సలహాదారులు మండవ శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షులు ఆర్.వరప్రసాద్, కార్యదర్శి సీహెచ్ మహేష్, కోశాధికారి జె.దయాకర్, పల్లంశెట్టి, రాజేష్‌కుమార్, సాధన రాజులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.