Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన రాజేష్(పేరుమార్చాం) ప్రయివేటు ఉద్యోగి. కొద్దిరోజుల కిందట ఆయన తమ ఇద్దరు పిల్లల పేర్లను రేషన్ కార్డులో చేర్చాలని పౌర సరఫరాలశాఖ అధికారులను సంప్రదించగా.. మీ-సేవలో దరఖాస్తు చేసుకోమని సూచించడంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. రేపో మాపో రేషన్ కార్డులో వారి పేర్లు నమోదు అవుతాయని ఎదురుచూస్తున్నాడు. కానీ నేటికీ ఇంకా వారి పిల్లల పేర్లు కార్డులో నమోదు కాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నాడు. వాస్తవానికి ప్రభుత్వం అందించే పథకాలను లబ్ది పొందాలంటే అతని ఇద్దరు పిల్లల పేర్లు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతం ఆ అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నాడు. ఇది ఒక్క రాజేష్‌కు ఎదురవుతున్న సమస్యే కాదు. ఎంతో మంది చిన్నారుల పేర్లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు కార్డు బదిలీ కోసం, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన యువతుల పేర్లు వారి కుటుంబానికి జారీ చేయడబడిన రేషన్ కార్డుల్లో నమోదు కావడంలేదు.
మరణించిన వారి పేర్లు తొలగించినట్టుగానే..
కొత్త రేషన్ కార్డుల జారీని ప్రభుత్వం జులై 26నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ పాత కార్డుల్లో ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలంటే పౌరసరఫరాల శాఖ ఆమోదం తెలపడం లేదు. ఫలితంగా ఎంతో మంది పథకాలను లబ్ది పొందడానికి అర్హత సాధించడం లేదు. కొత్త కార్డుల జారీతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 6,36,698కు చేరింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్పించడానికి పౌర సరఫరాలశాఖకు జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆరేండ్ల కాలంలో దాదాపు 99,668 దరఖాస్తులు రాగా.. 48,498 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలావుండగా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి వెంటనే తొలగించి వారి కోటా బియ్యాన్ని ప్రభుత్వం మినహాయిస్తుంది. కానీ కొత్త సభ్యులకు చేర్పించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలేదు. దీంతో కొత్త సభ్యులను చేర్పించడానికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నా రేషన్ కార్డుల్లో చేర్చడానికి పౌరసరఫరాల శాఖ ఆమోదం చెప్పడం లేదు. దీనివల్ల ఎంతో మంది నానా అవస్థలు పడుతున్నారు. నేటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రేషన్‌కార్డుల్లో మరణించిన వారి పేర్లు తొలగించినట్టుగానే కుటుంబంలో ఎవరైనా సభ్యులు చేరితే వారి పేర్లను ఎప్పటికప్పుడు చేర్చడం నిరంతరం కొనసాగాలని పలువురు కోరుతున్నారు.
దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందిస్తూ.. కొత్త కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కావొస్తున్న నేపథ్యంలో త్వరలోనే రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల(మ్యుటేషన్ల)కు ప్రభుత్వం గ్రీన్‌సిగల్ ఇవొచ్చునని, పైనుంచి ఆదేశాలు వచ్చి రాగానే అందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని అధికారులు వివరిస్తున్నారు.