Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువును రూ.7కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్ద్దేందుకు సుందరీకరిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. గురువారం తన కార్యాలయంలో మీర్పేట్ పెద్ద చెరువు అభివద్ధిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్ద చెరువును మరో ట్యాంకుబండ్ మాదిరిగా చేయబోతున్నట్లు పేర్కొన్నారు. చెరువుకట్ట వెడల్పు, చెరువు లోపల 3 ఎకరాల్లో ఐలాండ్ ఏర్పాటు చేయడంతో పాటు సుందరీకరణకు రూ.7 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులకు ఈ నెల 11వ తేదీన శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కు చుట్టు పాదచారులు నడిచేందుకు వీలుగా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ ఆహ్లాదకరమైన మొక్కలు పెంచబోతున్నామని మంత్రి తెలిపారు. సాయంత్రం వేళల్లో వచ్చే సందర్శకులను ఆకట్టుకునేందుకు అధునా తనమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువుకు ఒక వైపు భీం బారియర్, రైలింగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హెచ్ఎండిఎ ఈఈ రమేష్ కుమార్, డీఈ ధన్ మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.