Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ప్రపంచవ్యాప్తంగా ఆర్థోపెడిక్ వైద్య విధానంలో అందుబాటులోకి వచ్చిన మార్పులను, అత్యాధునిక సాంకేతిక విద్య పరిజ్ఞానాన్ని, తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వైద్యులు, వైద్య విద్యార్థులకు చక్కని అవకాశమని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ అన్నారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా వైద్య కళాశాల ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న 6వ వార్షికోత్సవం సదస్సు (వర్చువల్) శుక్రవారం కోఠి లోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్థోపెడిక్ వైద్యులు సులభ పద్ధతుల్లో సర్జరీలు నిర్వహించడం పట్ల వైద్యులు తమ నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి సదస్సులు ఉపయోగపడతాయన్నారు. నిర్వహణ కమిటీ కార్యదర్శి ఉస్మానియా ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ వై తిమ్మారెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు కొనసాగుతున్న ఈ సదస్సు ఆర్థోపెడిక్ వైద్యులకు వైద్య విద్యార్థులకు చక్కని వేదిక అని అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా 940 మంది వైద్యులు ఈ వర్చువల్ సదస్సులో పాల్గొనేందుకు పేర్లను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. తొలి రోజు కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్, రెండోరోజు కాన్ఫరెన్స్, మూడో రోజు వర్క్‌షాప్ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సుధీర్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయ భాస్కర్, నిర్వాహక కమిటీ చైర్మెన్ డాక్టర్ జి వీఎస్ మూర్తి, కార్యదర్శి డాక్టర్ వై తిమ్మారెడ్డి, డాక్టర్లు శేఖర్, రమేష్, కృష్ణా రెడ్డి, రాధాకృష్ణ, వీరారెడ్డి, శ్రీనివాస్, సుధీర్, ప్రవీణ్, అబ్బాస్, సతీష్, రవికిరణ్, అగ్నిష్ పాల్గొన్నారు.