Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని పాతబస్తీకి చెందిన బి.విద్య కృష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన చార్మినార్ బ్రాంచ్లో లాక్డౌన్కు ముందు 6నుంచి పదో తరగతి వరకు హిందీ క్లాసులు బోధించేది. కరోనా లాక్డౌన్తో గతేడాది మార్చి నుంచి విద్యాసంస్థలు మూతపడడంతో ఇంటికే పరిమితమైంది. దీంతో నెలకు వచ్చే రూ.10వేల జీతం బంద్ అయ్యింది. రెండేండ్లుగా భర్తకు వచ్చే రూ.12వేల సంపాదనతోనే కుటుంబపోషణ, పిల్లల ఫీజులు, ఇతర ఖర్చులు వెళ్లదీస్తున్నారు. కరోనా కష్టకాలంలో స్కూల్ యాజమాన్యం ఎలాంటి సాయం చేయలేదు. కనీసం పీఎఫ్ అమౌంట్ ఇప్పించాలని అడిగితే స్కూల్ ప్రారంభమైతేగానీ ఇవ్వమని చెప్పడంతో ఉన్నదాంట్లో సర్దుకుంటున్నామని వాపోయింది. ఇది ఒక్క టీచర్ బి.విద్య సమస్యే కాదు.. నగరంలోని వేలాది మంది ప్రయివేటు టీచర్ల ఎదుర్కొంటున్న సమస్య. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. ఉన్నత చదువులు చదువులతో పాటు బీఈడీ కోర్సులు కూడా చదివిన వారు ఎంతో మంది ఇతర పనులు కూడా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
అన్ని వర్గాల నుంచి ప్రయివేటు స్కూళ్లలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిని ఆదుకోవాలనే డిమాండ్ రావడంతో ఈ ఏడాది మార్చిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'అపత్కాలపు' సాయం పేరిట ప్రయివేటు టీచర్లను ఆదుకనేందుకు ముందుకొచ్చింది. ఆర్థిక చేయూతనివ్వడమేగాక దీనిని బడులు ప్రారంభమయ్యే వరకు కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రతిపూట దినదినగండగా గడుస్తున్న ప్రయివేటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు ప్రభుత్వ ఆర్థిక సహాయం కొంత ఆసర అవుతూ వచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 32,709 మంది సాయం అందుకున్నారు. ఈ క్రమంలో జులై మాసం పోయి ఆగస్టు వచ్చిన ఇంకా వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ కాకపోవడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా అధికారులను అడిగితే ఈ అంశం తమ పరిధిలో లేదంటూ చేతులేస్తున్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించే వరకు కరోనా 'అపత్కాలపు' సాయాన్ని కొనసాగించాలంటూ పలువురు టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కరోనా నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం కూడా ప్రభుత్వం ఆన్లైన్ బోధనకే మొగ్గుచూపింది. అంతేగాక ఈ ఏడాది జులై 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చునని సర్కారు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటులోనూ ప్రారంభించారు. అయితే యాజమాన్యాలు అందరిని విధుల్లోకి తీసుకోకపోవడం లేదు. విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, తల్లిదండ్రులు సైతం ఫీజులు చెల్లించడం లేదన్న సాకుతో సగానికి తక్కువ మంది ఉపాధ్యాయులను తీసుకున్నారు. వారితోనే ఆన్లైన్ క్లాసులు చెప్పిస్తున్నారు. వీరికి కూడా పూర్తి జీతం ఇవ్వడం లేదని, సగమే ఇస్తున్నట్టు తెలిసింది. ఫీజులు వసూలును బట్టి వీరికి వేతనాలు చెల్లిస్తున్నట్టు ప్రయివేటు టీచర్లు చెబుతున్నారు. అయితే అన్ని పాఠశాలల్లో ఆన్లైన్ విద్య ప్రారంభమైందని, ప్రయివేటు ఉపాధ్యాయులకు వేతనాలు వస్తుండడంతో ప్రభుత్వం సాయాన్ని నిలిపివేసినట్టు చెబుతున్నారు. పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యేవరకు నెలకు రూ2వేలు, 25కిలల బియ్యం సాయాన్ని కొనసాగించాలని పలువురు ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.