Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
'క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలిద్దాం-ఆగస్టు 9న భారత రక్షణ దినం పాటిద్దాం' అంటూ సీఐటీయూ నాయకులు ఆదివారం కూకట్ పల్లి ఆటోస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం శంకర్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి, కె. కృష్ణ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశ చరిత్రలో1942 ఆగస్ట్ 9 ఒక చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వేలాది మంది జనం దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి చావోరేవో తేల్చుకుందామని వీరోచిత పోరాటం సాగించారని, దాని ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిదన్నారు. కానీ గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు అవలంభిస్తున్న సరళీకరణ విధానాలు దేశాన్ని అధోగతిపాలుజేశాయన్నారు. నిత్యం పెరుగుతున్న నిరుద్యోగం, పేదరికం, పౌష్టికాహారలోపం, ఆకలిచావులు, ఆత్మహత్యలు దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందన్నారు. దేశ సంపద, సహజవనరులను విదేశీ, స్వదేశీ ప్రయివేట్ కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు తీవ్రమైన పోరాటాలు కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేయాలని చూస్తున్నందున దేశవ్యాప్తంగా ఆగస్టు 9న జరిగే నిరసన కార్యక్రమాల్లో కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆటోస్టాండ్ నాయకులు భాస్కర్, మహేందర్, ఆర్ సత్య బాబు, ఐలయ్య, గోపి, భీమ్ రాజ్, అర్జున్, ముఖలింగం తదితరులు పాల్గొన్నారు.