Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తార్నాక డివిజన్ లాలాపేట్ ప్రొఫెసర్ జయశంకర్ ఇండోర్ స్టేడియంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ. 6కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలోనే భూమిపూజ చేసేందుకు అధికారులు సైతం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. 50 మీటర్ల పొడవు, 21 మీటర్ల వెడల్పు, ఒకవైపు 1.35 మీటర్లు, మరోవైపు 2 మీటర్ల లోతుతో స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెక్నాలజీ వినియోగిస్తూ ఈత పోటీలు నిర్వహించేందుకు వీలుగా నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒకేసారి 50 నుంచి 70 మంది వరకు ఈత కొట్టేందుకు వీలుగా 8 లైన్లు ఏర్పాటుతో పాటు దీనికి పక్కనే చిన్నపిల్లల కోసం 8 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పులో బేబీ పూలు కూడా నిర్మించనున్నారు. ఆడ, మగ వారికి వేర్వేరుగా చేంజింగ్ రూమ్స్, ఫిల్టర్ రూమ్స్ ఉంటాయి. అధునాతన మిషనరీతో నిత్యం వాటర్ ప్యూరీఫయింగ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
నిర్మాణ పనులను అడ్డుకుంటున్న స్థానికులు
జయశంకర్ ఇండోర్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడంపై స్థానికులు, వాకర్స్ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. భూమిపూజ కోసం ఏర్పాటు చేస్తున్న నిర్మాణ పనులను అడ్డుకొని ఇటీవలే ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. స్విమ్మింగ్‌పూల్ ఇక్కడ వద్దని వేరే చోట నిర్మించాలని వారు కోరుతున్నారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని వేరేచోటకు ఈతకొలను తరలించాలని సూచిస్తున్నారు.