Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
వయోపరిమితి పేరుతో మున్సిపల్ కార్మికులను విధుల నుంచి తొలగించడం సరైంది కాదని సీఐటీయూ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ అన్నారు. ఈమేరకు ఆదివారం తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గోపికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను వయోపరిమితి పేరుతో తొలగించటం అన్యాయమన్నారు. జీహెచ్ఎంసీలో మాదిరిగానే ఓపిక ఉన్నంతవరకు కార్మికులు పని చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. ఇటీవల వేతనాలు పెరిగినా, వాటికి సంబంధించి ఏరియర్స్ చెల్లించడం లేదని, కార్మికులకు కనీస వేతనం రూ.21వేలు నిర్ణయించి అమలయ్యే చర్యలు చేపట్టాలని కోరారు. వారసులు ఉన్న కార్మికులకు రూ. 10 లక్షలు, వారసులు లేని కార్మికులకు రూ.15లక్షల బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో కార్మికులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తిని రగిలించి భారతదేశాన్ని పరిరక్షించుకోవాలని ఆగస్టు 9 వి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన నిరసన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు పెంటన్న ఎన్.ఎల్లమ్మ, నరసింహ, శ్రీను, లక్ష్మి, మల్లేష్, జె. వెంకన్న, ఈ. సత్యనారాయణ, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.