Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
తమ భూమిని కబ్జాచేయడానికి యత్నించడంతో పాటు తమపై రాళ్లతో దాడిచేసి, చంపడానికే వచ్చామంటు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడిన రియల్ వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఘనపూర్ వార్డు సభ్యులు వర్త్య పవన్ నాయక్, గుగులోత్ కాంతమ్మ, ఫకీర్ టెక్యా తండావాసులు డిమాండ్ చేశారు. ఘట్కేసర్ మండలం ఘనపూర్ పరిధిలోని ఫకీర్ టెక్యా తండాలో మంగళవారం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల క్రితం ఘణపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 1107లోని రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, సర్వే నెంబర్ 1106లోని పట్టా భూమిగా చూపించి లే అవుట్ చేశారని వారు ఆరోపించారు. అట్టి లే అవుట్‌ను అధికారులు రద్దు చేశారని అందులో కొన్ని ప్లాట్లకు మాత్రమే అనుమతించారని తెలిపారు. కొంత మంది అక్రమార్కులు రద్దు చేయబడిన లే అవుట్ ప్రకారం ప్లాట్లు విక్రయిస్తున్నారని, అందులో తమకు చెందిన భూమిని సహితం అక్రమించి విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తమ భూములను ఎందుకు కబ్జాచేస్తున్నారని అడ్డుకుంటున్న తమపై సోమవారం అన్నోజిగూడకు చెందిన కొందరు రియల్ వ్యాపారులు తమపై రాళ్లతో దాడి చేశారని, అంతే కాకుండా చంపేస్తామని బహిరంగానే హెచ్చరించారని ఆరోపించారు. సదరు వ్యక్తులతో తమకు ప్రాణ భయం ఉందని పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని తెలిపారు. గతంలో మహిళ అని చూడకుండా చెట్టుకు కట్టేసికొట్టారని, ఇలాంటి దాడులు ఎన్నో జరిగాయని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమితో పాటు తమ భూమిని కబ్జారాయుళ్ల చెరనుండి కాపాడడంతో పాటు తమకు ప్రాణ రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండావాసులు మాజీ వార్డు సభ్యులు మాలోత్ సురేష్, నాయకులు సుమన్, హన్మమ్మ, పార్వతి, నాగమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గ్గొన్నారు.