Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్/బడంగ్పేట్
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ దోమలపల్లి ధనలక్ష్మి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రూ. 6 కోట్ల 20 లక్షలతో పెద్ద చెరువు సుందరీకరణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ. 850 కోట్లతో శివారు ప్రాంతాలకు మౌలిక సదుపాయాల కల్పనకోసం సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని చెప్పారు. యాంత్రికమైన నగర జీవనం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉపశమనం పొందటానికి చెరువుల సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. దీంతో చెరువులు కబ్జాకు గురి కావని చెప్పారు. పెద్ద చెరువు కట్ట వెడల్పుతోపాటు, వాకింగ్ ట్రాక్, చెరువు మధ్యలో ఐలాండ్, పిల్లల పార్క్, మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సందే చెరువును అభివృద్ధి చేశామని, మంత్రాల చెరువును కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. చెరువుల్లో డ్రయినేజీ నీరు కలవకుండా ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతంలో వర్షం పడితే నీరు నిల్చిన ప్రాంతాలను కేవలం సందర్శించి పోయేవాళ్లమని, కానీ ఇప్పుడు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ట్రంక్ లైన్ నిర్మాణానికి పురపాలక మంత్రి కేటీఆర్ రూ 23 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వర్షపు నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రంక్ లైన్లోకి కలుపవద్దని సూచించారు. బీఎన్ రెడ్డి నగర్ నుంచి మీర్పేట్ జిల్లెలగూడ చెరువులలో కలుపుతూ నూతనంగా ట్రంక్‌లైన్‌కు సీఎం నిధులు మంజూరు చేశారని చెప్పారు. ట్రంక్ లైన్‌తో పాటు పక్కన డ్రయినేజీ కూడా నిర్మిస్తామన్నారు. చెరువులను సుందరీకరిస్తుంటే.. అభివృద్ధి పనులు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని, అనవసర విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్‌రెడ్డి, ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు
హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో రంగారెడ్డి జిల్లాలోని నిరుపేదలకు కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ ఆఫీసులో జిల్లా గృహ నిర్మాణ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లబ్దిదారులపై ఒక్కపైసా కూడా భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల వ్యయంతో డబుల్బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తుందన్నారు. ఇండ్లు నిర్మించి ఇవ్వడం ద్వారా పేదలకు సమాజంలో మంచి హోదాను సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని చెప్పారు. రాజీవ్ గృహకల్ప, ఇందిరా ఆవాస్ యోజన పథకాల్లో భాగంగా నిర్మించి ఇచ్చిన ఖాళీలను గుర్తించి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించాడు. డబుల్ బెడ్ రూమ్‌లకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఇది డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేసి, వచ్చే మార్చి నెలలో లబ్దిదారులకు ఇండ్లను అందజేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు అంకంరావు, శ్రీధర్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.