Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నిర్భాగ్య మహిళలకు, సమాజంలో నిర్లక్ష్యానికి గురి కాబడుతున్న వర్గాలకు న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ సుమలత అన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా నగరంలోని వివిధ మురికివాడలకు చెందిన యువతులకు గురువారం పురానా హవేలిలోని న్యాయ సేవాసదన్‌లో న్యాయ సేవలపై సిటీ సివిల్ కోర్ట్ న్యాయ సేవా అధికార సంస్థ, యాక్షన్ ఎయిడ్ సంస్థలతోకలిసి నిర్వహించిన అవగాహన సదస్సులో సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జి, సిటీ సివిల్ కోర్ట్ న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ సుమలత ప్రసంగించారు. మహిళలు, యువతీ, యువకులు చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం ఉందన్నారు. అన్యాయానికి గురికాబడినప్పుడు, తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మహిళలు, యువకులు చట్టాన్ని ఆశ్రయించి రక్షణ పొందొచ్చని సూచించారు. మహిళలకు అండగా నిలిచేందుకు వారికి న్యాయ సహాయం అందించేందుకు న్యాయసేవాధికార సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వివరించారు . ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించి, చట్టానికి లోబడి జీవించాలని సూచించారు. ఆత్మవిశ్వాసంతో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నారని, పట్టుదలకు కఠోర శ్రమను జోడించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.మురళీమోహన్ మాట్లాడుతూ పలుచట్టాలపై మహిళలకు అవగాహన కల్పించారు. మహిళలకు పురుషులతో సమానంగా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందనీ, పెళ్లిసందర్భంగానూ, ఆ తరువాత వరకట్నాన్ని డిమాండ్ చేయడం, కట్నం తీసుకోవడం నేరమని పేర్కొన్నారు. స్త్రీకి తన శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని, ఆ హక్కుకు భంగం కలిగితే దోషులకు చట్ట ప్రకారం శిక్షలు పడతాయని వివరించారు. యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రోగ్రామ్ ఆఫీసర్ వందనబురదర్ మాట్లాడుతూ మహిళా చైతన్యం కోసం తమ సంస్థ న్యాయసేవాధికార సంస్థతో కలిసి పని చేస్తుందని వివరించారు. కార్యక్రమం అనంతరం చీఫ్ జడ్జి డాక్టర్ సుమలత పాల్గొన్న యువతులను న్యాయస్థాన సందర్శనకు అనుమతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతులు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలోని వివిధ న్యాయస్థానాలను సందర్శించి న్యాయస్థానాలు పని చేసే విధానాన్ని, వాటి అనుబంధ కార్యాలయాల పనితీరును పరిశీలించారు.