Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
సరైన సమయానికి శరీరంలో పాడైన అవయవాల స్థానంలో వాటికి సరిపోయే అవయవాలను అమరిస్తే ప్రతియేటా వేలాది మరణాలు సంభవించకుండా నివారించవచ్చు. కానీ మన దేశంలో అవయవదానంపై అవగాహన చాలా తక్కువ. మరణం తర్వాత అవయవదానానికి చాలామంది ముందుకు రావట్లేదు. ప్రపంచ అవయవదాన దినోత్సవం 2021 సందర్భంగా నగరంలోని ప్రముఖ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులలో ఒకటైన గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి హైదరాబాద్ నగర పోలీసులతో కలిసి అవయవదానంపై అవగాహన పెంపొందించేందుకు ఒక కార్యక్రమం నిర్వహించింది.
అవయవాల మార్పిడి సమయంలో వాటిని శరవేగంగా తీసుకెళ్లేందుకు హైదరాబాద్ నగర పోలీసులు (శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాలు రెండూ) చేస్తున్న కషిని ఆసుపత్రివర్గాలు ప్రశంసించాయి. ప్రజల ప్రాణాలు కాపాడటంలో వారి సేవలకు గుర్తింపుగా గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి శుక్రవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను సత్కరించింది. సరైన సమయానికి అవయవాలను చేర్చడంలో నగర పోలీసుల కృషికి గాను వారి ప్రతినిధిగా ఆయనకు సన్మానం చేసింది. ఆయనతో పాటు అదనపు కమిషనర్ (శాంతిభద్రతలు) డీఎస్.చౌహాన్, అదనపుకమిషనర్(ట్రాఫిక్)అనిల్‌కుమార్, డీసీపీ ఎల్ఎస్చౌహాన్లనూ సత్కరించారు.
ఈ సందర్భంగా నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ, 'తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి అవయవదానం ఒక్కటే ఏకైక ఆశ. మరణానంతరం అవయవాలు దానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటమే కాదు, ఆ అవయవాలు స్వీకరించినవారి రూపంలో ఇచ్చినవారు మరికొన్నాళ్లు జీవిస్తారు. అవయవాలకు తీవ్రమైన కొరత ఉందంటే కోట్లాది మంది ప్రజలు ఇంకా బాధపడుతూ జీవిస్తున్నారని అర్థం. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఇక రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. మరణానంతరం అవయవాలు దానం చేస్తామని ప్రతినబూనేవాళ్ల వల్లే వారి బాధలు తీరుతాయి' అని చెప్పారు. 'అవయవ దానం విషయంలో సమయం చాలా కీలకమైనది. అవయవాలను దాత నుంచి గ్రహీత వద్దకు సరైన సమయానికి చేర్చడంలో హైదరాబాద్ నగర పోలీసులు చాలా సందర్భాల్లో అత్యంత కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది నుంచి ఈ సహకారం అందకపోతే గ్రహీతల వద్దకు అవయవాలను సరైన సమయానికి చేర్చడం మాకు చాలా కష్టం అవుతుంది' అని లక్డీకాపుల్ గ్లెనీగల్స్ గ్లోబల్ ఆసుపత్రి సీఈవో గౌరవ్ ఖురానా అన్నారు.