Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
భారతదేశంలోని ప్రముఖ 'పేషెంట్ స్పెసిఫిక్' సొల్యూషన్ ప్రొవైడర్ అనాటో మిజ్ 3డీ మెడిటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సహకారంతో, రోగి, సర్జన్లకు ఇద్దరికీ అనుకూలంగా ఉండే విప్లవాత్మక 3డీ మోడలింగ్ టెక్నాలజీని అపోలో హాస్పిటల్స్ ఆవిష్కరించింది. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో బుధవారం 3డీ ప్రింటింగ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ రీజినల్ సీఈవో వై సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సర్జరీ టూల్స్, ప్రొస్తెటిక్ ఇంప్లాంట్లను కచ్చితత్వంతో సర్దుబాటు చేయడానికి, 3డీ ప్రింటింగ్ వీలుకల్పిస్తుందన్నారు. రోగికి శరీరంలో తక్కువ కోత, ప్రత్యేకించి పరిసర కణజాలానికి తక్కువ నష్టంతో రిమోట్ యాక్సెస్‌తో కూడిన శస్త్రచికిత్సను అందించేందుకు ఈటెక్నాలజీ ఒక వరం అని అన్నారు. శస్త్రచికిత్సల ద్వారా అనారోగ్యాన్ని, మరణాలను బాగా తగ్గించడానికి, విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుందన్నారు. అపోలో హాస్పిటల్ ప్రముఖ నిపుణులైన డాక్టర్లు త్రీడీ ప్రింటింగ్ ఉపయోగించి, క్లిష్టమైన వైద్య పరిస్థితుల్లో ఉన్న ముగ్గురు రోగులకు విజయవంతంగా చికిత్స అందించారని పేర్కొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ అపోలో గౌరవ ప్రొఫెసర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్, డాక్టర్ రూమా సిన్హా మాట్లాడుతూ ఊహించని ప్రదేశాల్లో ఎక్కువమోతాదు ఫైబ్రాయిడ్స్‌తో బాధపడుతున్న 31 ఏండ్ల అవివాహితకు 3డీ మోడల్నుపయోగించి రోబోట్ సహాయక లాప్రోస్కోపిక్ మయో మెక్టమీ సర్జరీని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు రాజీవ్ రెడ్డి, చిన్నబాబు సుంకవల్లి, రవీంద్ర బాబు పాల్గొని త్రీడీ మోడల్ రోబోట్ ఉపయోగాలను వివరించారు. 1983లో డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ ఆస్పత్రి అపోలో హాస్పిటల్‌ను చెన్నైలో ప్రారంభించారని గుర్తు చేశారు. అపోలో హాస్పిటల్స్ చైర్మెన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కి 2010లో ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేశంలోని అధునాతన వైద్యసేవలకు అపోలో ముందువరుసలో ఉందని చెప్పారు.