Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిరాజా
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
దేశంలో మహిళలపై జరుగుతున్న భయంకరమైన లైంగిక నేరాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుర్తిగా విఫలమయ్యాయని భారత జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిరాజా ఆరోపించారు. మహిళలు, విద్యార్థినీలపై లైంగికదాడులు, హత్యలను నిరసిస్తూ గురువారం హిమాయత్‌నగర్ 'వై' జంక్షన్ వద్ద మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో లైంగిక దాడి నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా అనిరాజా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం భారతదేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ లైంగికదాడికి గురవుతుందని, ముఖ్యంగా దళిత మహిళలే ఎక్కువగా లైంగిక హింస, ఇతర దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలను అరికట్టడం, దర్యాప్తు చేయడంలో స్థానిక పోలీసులు తరచుగా విఫలమవుతున్నారన్నారు. దేశంలో మహిళల భద్రతను మెరుగుపరచడానికి, లైంగిక హింస నుంచి వారిని రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ ప్రణాళికలు, కఠినమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రజిని, రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన, ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, మహిళా నేతలు కృష్ణకుమారి, యాదమ్మ, గిరిజ, అశ్విని, అంజుమ్, మహేశ్వరి, హైమావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.