Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
చేతిగాయాలు, నరాల స్నాయువులు టెన్షన్స్ (కండరాలను, ఎముకలను కలిపే తాడువంటి నరాలు), ఇతర అన్ని శరీర నిర్మాణాలను మరమ్మతులు చేయడానికి హ్యాండ్, మైక్రో సర్జరీ అవసరం అవుతుందని అపోలో కన్సల్టెంట్ హ్యాండ్, మైక్రోసర్జన్ ఆర్థోపెడిక్ విభాగం డాక్టర్ గోపీనాథ్ బండారి తెలిపారు. అంగవైకల్యాన్ని నివారించడం, తెగిపోయిన శరీర భాగాన్ని సంరక్షించడం, రవాణా చేయడంపై ఇండియన్ సొసైటీ ఫర్ సర్జన్స్ ఆఫ్ హ్యాండ్‌తో కలిసి సోమవారం అపోలో హాస్పిటల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి వద్ద/కర్మాగారాలు/పరిశ్రమల్లో సాధారణ గాయాలు, చేయి నలిగిపోవడం, చేతి వేళ్లు తెగిపోవటం జరిగినప్పుడు, బాధితులకు సరైన సమయంలో వైద్యం అందించాలన్నారు. లేకపోతే వారు జీవితాంతం శారీరక వికలాంగులుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. తెగిపోయిన భాగాన్ని వెంటనే పంపు నీటితో కడిగి జాగ్రత్తగా ప్లాస్టిక్ కవర్లో ఉంచి, ఐస్‌బాక్స్‌లో భద్రపరచాలన్నారు. ఈభాగాన్ని నాలుగు నుంచి ఆరు గంటలలోపు సమీపంలోని హ్యాండ్, మైక్రో సర్జరీ సౌకర్యాలు ఉన్న హాస్పిటల్స్‌కు రవాణా చేయాలన్నారు. ఇలాంటి ప్రమాదాలకు గురైన వారు కంగారు పడకుండా, ధైర్యంగా ఉండి తగిన జాగ్రత్తలతో వైద్యం చేయించుకోవాలని ఆయన సూచించారు.